జగన్‌ సర్కారు కార్యక్రమాలు అద్భుతం

Women Celebrities Praise CM YS Jagan Government - Sakshi

ఏపీలో మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళా ప్రముఖుల ప్రశంసల వర్షం

సాక్షి, అమరావతి: మహిళా సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సర్కారు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని వివిధ రాష్ట్రాలు, పలు రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఒకేసారి 30 లక్షల మంది మహిళలకు నివాసస్థల పట్టాలు ఇవ్వడమనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే అధ్యాయమని వారు కొనియాడారు. అలాగే, అమ్మఒడి అద్భుత కార్యక్రమమని, దీని ద్వారా పిల్లలను చదివించే బాధ్యతను సీఎం జగన్‌ మహిళలపై పెట్టారని వారు ప్రశంసించారు. తల్లి విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతులవుతారనే సత్యాన్ని గ్రహించి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టారని, ఇందుకు వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పేద అక్కచెల్లెమ్మలకు శుక్రవారం పెద్దఎత్తున నివాస స్థలాల పట్టాలు అందిస్తున్న సందర్భంలో అనేకమంది మహిళా ప్రముఖులు స్పందించారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..  

గర్వించదగ్గ విషయం
సమాజ సర్వతోముఖాభివృద్ధికి మహిళా సాధికారత దోహదపడుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల పేరుతో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుండటం ఆనందదాయకం. ఇది అందరూ గర్వించదగ్గ విషయం.    – పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత పీవీ సింధు

మహిళా సాధికారతకు విప్లవాత్మక చర్యలు
మహిళా సాధికారత దిశగా ఏపీ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తోంది. అమ్మఒడి అద్భుత కార్యక్రమం. పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్సార్‌ ఆసరా ఎంతో దోహదపడుతుంది. మహిళల పేరుతో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతుండటం ప్రశంసనీయం.     – సంగీత రెడ్డి, అపోలో ఆస్పత్రి జేఎండీ

ప్రతి మహిళను మహారాణిగా చేసే కార్యక్రమాలు
రాష్ట్రంలో ప్రతి మహిళను లక్షాధికారిగా, మహారాణిగా చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళల పేరుతో ఆస్తి సమకూర్చే ఇళ్ల పట్టాలు ఇవ్వడం అభినందనీయం. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. – జమున, పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌

మహిళలకు ప్రాధాన్యం ప్రశంసనీయం 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అమ్మ ఒడి అమలు, ఇళ్ల పట్టాల పంపిణీ అభినందనీయం. – మెర్లిన్‌ ఫ్రీడా, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌ 

పురుషులతో సమానంగా అభివృద్ధికి చర్యలు
మహిళలను అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రగతిబాటలో నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రశంసనీయం.    – డా. యాస్మిన్‌ ఆలీ హాక్, యునిసెఫ్‌ ఇండియా 


జగన్‌ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రశంసనీయం 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల మహిళల అభ్యున్నతికి అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయం.    – ప్రమీలనాయుడు,  కర్ణాటక మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

అన్నింటా మహిళలకు అగ్రాసనం 
జగనన్న ప్రభుత్వం అన్నింటా మహిళలకు అగ్రాసనం వేస్తోంది. నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించింది. ఇప్పుడు ఒకేసారి 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇస్తోంది.  మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రభాగాన ఉంది.     – ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే

మహిళల భద్రతకు ‘దిశ’
మహిళా సాధికారత కోసం సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు ఎంతో కృషిచేస్తోంది. ఇళ్ల పట్టాల పంపిణీ కూడా ఇందులో భాగమే. అందుకే ఈ సర్కారుకు మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరొచ్చింది. మహిళల భద్రతకు దిశ చట్టం తెచ్చి పటిష్టంగా అమలుచేస్తోంది.     – మేకతోటి సుచరిత, రాష్ట్ర హోంమంత్రి

మహిళా సాధికారతకు కొత్త అర్థం 
వినూత్న కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్ధం చెబుతోంది. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇవ్వాలని నిర్ణయించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర మహిళల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.     – వాసిరెడ్డి పద్మ, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top