అన్నమయ్య జిల్లా : ‘నా భర్త నాకు కావాలి’... అంటూ ఒక వివాహిత భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. సోమవారం రాయచోటి రాజుల కాలనీలో ఆమె మౌన పోరాటం సాగించింది. ఆమె కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండలం నాయనివారిపల్లెకు చెందిన సుజాత, రాయచోటి మండలం రాజుల కాలనీకి చెందిన తరగొండ మల్లేష్ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వివాహం చేసుకొని వేరు కాపురం పెట్టారు. అయితే మల్లేష్ కొన్ని రోజుల క్రితం రాయచోటిలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు.
అక్కడి నుంచి తనకు మోసం చేయడం మొదలు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి తనకు తెలియకుండా మరో అమ్మాయితో వివాహం కూడా చేశారని ఆరోపించింది. ఈ విషయం తెలియడంతో తాను ఇక ఏమీ చేయలేక తన భర్త ఇంటి వద్దకు రాగా.. తన భర్తతోపాటు అత్తమామలు తనను ఇంటిలోకి రానీయకుండా అడ్డగిస్తున్నారని వాపోయింది. ఈ విషయం తెలుసుకున్న రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి ఆమెను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు సంబేపల్లె పోలీస్‌స్టేషన్‌కు పంపినట్లు తెలిపారు.


