మూడు ముళ్లకు వేళాయె!.. నేటి నుంచి జూన్‌ 23 వరకు శుభ దినాలే

Wedding Subha Muhurtham Starts From Today - Sakshi

మొదలవుతున్న పెళ్లిళ్ల సందడి 

రెండేళ్లుగా కల్యాణాలకు దూరంగా బంధువులు 

కరోనా తొలగిపోవడంతో మళ్లీ కళకళ 

సాక్షి, ఆళ్లగడ్డ రూరల్‌: మాంగల్యం తంతునా.. మమ జీవనం హేతునా.. కంఠే భద్మామి సుభగే...త్వం జీవ శరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు ఈ సారి మారుమోగనున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి పూర్తిగా దూరం కావడంతో పల్లెల్లో, పట్టణాల్లో పరిణయ ఝరి పరిమళించనుంది. గత రెండేళ్లలో కేవలం వధూవరుల బంధువులు 10 నుంచి 20 మందికి మాత్రమే అనుమతులు ఉండటంతో పెళ్లిళ్లలో కళ తప్పింది. ఈసారి ఏప్రిల్‌ 13 నుంచి జూన్‌ 23 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో యువతీ యువకులు, తల్లిదండ్రులు సంబర పడుతున్నారు. 

మొదలైన సందడి 
ఇప్పటికే కొందరు పెళ్లికార్డులు ఆర్డర్లు ఇస్తూనే కల్యాణ మండపాలు అడ్వాన్సులు ఇచ్చి మరీ బుక్‌ చేసుకోవడం మొదలెట్టారు. మంచి ముహూర్తం కోసం పురోహితులను కలుసుకోవడం ముమ్మరం చేస్తున్నారు. మేమేం తక్కువా అంటూ మహిళలు కొందరు బంగారు నగలు కొంటుంటే... మరికొందరు చీరలు కొనడం మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు.  

ఒక పెళ్లి ఎంతో మందికి ఉపాధి 
పెళ్లంటే రెండు కుటుంబాలు కలవడం అంటారు. అంతేకాదు పెళ్లి ఏర్పాట్లలో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పెళ్లంటే ముందుగా గుర్చొచ్చేవి పెళ్లి పత్రికలు, నూతన పట్టు చీరలు, వధూవరుల పరిణయ పట్టు వస్త్రాలు, ఫొటోలు, వీడియోలు, ట్రావెల్స్‌ ఏజెంట్లు, పెళ్లి మండపాలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్రీ షియన్స్, బ్యాండ్‌ మేళం వారు. వీరంతా రెండేళ్లుగా ఉపాధి లేక అగచాట్లు పడ్డారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండటంతో ఉపాధి దొరుకుతుందని వారంతా సంబర పడుతున్నారు.  

మూడు నెలలు ముహూర్తాలే 
శుభకృత్‌ నామ సంవత్సరంలో వివాహాలు, శుభకార్యాల ముహూర్త తేదీలు 
ఏప్రిల్‌ : 13, 14, 15, 16, 17, 21, 22, 24     
మే : 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25     
జూన్‌ : 1, 3, 5 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23      

శుభలేఖలకు ఆర్డర్లు ఇస్తున్నారు 
ఇప్పటికే పెళ్లిళ్లు, వివిధ శుభ కార్యక్రమాల కోసం ఆహ్వాన పత్రికలు, పెళ్లి పత్రికల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో వివిధ రకాల డిజైన్లతో శుభలేఖలు సిద్ధం చేశాం. రూ.5 నుంచి రూ.వందల విలువైన పత్రికలు అందుబాటులో ఉంచాం. ఈసారి కరోనా లేనందున వ్యాపారాలు బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం. 
–ప్రసాద్, పెళ్లి పత్రికల ప్రింటర్స్, ఆళ్లగడ్డ 

మెండుగా శుభకార్యాలు 
ఈసారి శుభముహూర్తాలు మూడు నెలల్లో మెండుగా ఉన్నాయి. పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో పనులు ఉండవు కాబట్టి పెళ్లిళ్లకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలు వరంలా మారనున్నాయి. ఇప్పటికే చాలా మంది పెళ్లి, శుభ కార్యాలకు ముహుర్తాలకు సంబంధించి లగ్నపత్రికలు రాయించుకుంటున్నారు.    
–విజయ్‌స్వామి, పురోహితుడు, అహోబిలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top