
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి, నరసరావుపేట: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ వరదెత్తింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో.. ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 2,65,909 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 14 వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 2,51,909 క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి సుమారు 3 నుంచి 3.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కృష్ణాకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి కృష్ణ, సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్రల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,17,910 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 66,079, స్పిల్ వే 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,16,152 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలంలో 882.8 అడుగుల్లో 203.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి 2,82,609 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్ల ద్వారా 2,43,829 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 585.1 అడుగుల్లో 297.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 2,14,653 క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తి 2,04,904 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 171.29 అడుగుల్లో 40.21 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఇక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉరకలెత్తుతుండటంతో గోదావరిలో వరద స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,86,237 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 12,900 క్యూసెక్కులను వదలుతూ మిగులుగా ఉన్న 4,73,337 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.