
అందం, తెలివితేటలతో ఆకట్టుకున్న సాయిసాత్విక
యువతి సొంతూరు తెర్లాం మండలం సోమిదవలస
ఈనెల 25న డల్లాస్‌లో జరిగిన ఫైనల్ పోటీలు
తెర్లాం: విజయనగరం జిల్లా తెర్లాం మండలం సోమిదవలసకు చెందిన యువతి అందానికి అమెరికా ఫిదా అయింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో ఈనెల 25న జరిగిన తెలుగు అమ్మాయిల అందాల (‘మిస్ తెలుగు యూఎస్‌ఏ–2025’) పోటీల్లో ‘చందక సాయిసాత్విక’ రన్నరప్–2గా నిలిచింది. ఓ వైపు అందం.. మరోవైపు తెలివితేటలతో అందరినీ ఆకర్షించింది. చందక సూర్యకుమార్, సబితల రెండో కుమార్తె సాయిసాత్విక. ఆమె డేటా ఎనలైటికల్ కోర్సులో ఎమ్మెస్సీ చదవడానికి అమెరికా వెళ్లింది.
డల్లాస్‌లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్ తెలుగు యుఎస్‌ఏ–2025’ పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ నెల 25న డల్లాస్‌లో జరిగిన ఫైనల్ పోటీల్లో 22 మంది తెలుగు అమ్మాయిలు పాల్గొనగా అందులో అంకిత రెడ్డి విజేతగా నిలిచింది. రన్నరప్ 2గా సాయిసాత్విక ఎంపికైంది. సాయిసాత్విక విజయంపై తల్లిదండ్రులు, అక్క, బావ, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు.
మరచిపోలేని అనుభూతినిచ్చింది
ఫైనల్ పోటీల్లో రన్నరప్‌గా నిలవడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన అక్క సాయిసుస్మిత, బావకు రుణపడి ఉంటాను. నాకు ఓటువేసి మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారికి ధన్యవాదాలు. – సాయిసాత్విక మిస్ తెలుగు యూఎస్‌ఏ రన్నరప్ –2