విశాఖలో ఆటీన్‌ రాణులు | Vizag Man Files Complaint Against Poker-Playing Wife | Sakshi
Sakshi News home page

విశాఖలో ఆటీన్‌ రాణులు

Aug 10 2025 6:17 AM | Updated on Aug 10 2025 6:17 AM

Vizag Man Files Complaint Against Poker-Playing Wife

భర్త ఫిర్యాదుతో వెలుగులోకి మహిళల ‘చతుర్ముఖ పారాయణం’ 

కుటుంబాన్ని పట్టించుకోకుండా మూడు ముక్కలాట 

సీపీకి ఫిర్యాదు చేసిన ఓ భర్త 

ఆరుగురు మహిళల అరెస్ట్‌.. రూ.22 వేలు స్వాదీనం

విశాఖ సిటీ: విశాఖ ఆటీన్‌ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్‌లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగి్చకి ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. 

ఇళ్లే్ల పేకాట డెన్‌లు 
ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్‌ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. 

ఆరుగురి అరెస్ట్‌ 
సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.  

భార్య పేకాటపై భర్త ఫిర్యాదు 
ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్‌ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్‌గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్‌గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది.

భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్‌ టౌన్‌ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్‌గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement