నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్‌కి వస్తావా? | Vizag Lady Lecturers And Student Sai Teja Incident | Sakshi
Sakshi News home page

నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్‌కి వస్తావా?

Nov 1 2025 12:04 PM | Updated on Nov 1 2025 12:16 PM

Vizag Lady Lecturers And Student Sai Teja Incident

ఎంవీపీకాలనీ: విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న అతడి బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల విద్యార్థులు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన మేరకు.. తోటి విద్యార్థులతో సరదాగా ఉండే సాయితేజ కొంతకాలంగా తరగతులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా అధ్యాపకులు వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు, తమ్ముడి వద్ద పలుమార్లు వాపోయాడు. 

ఐదో సెమిస్టర్‌లో భాగంగా స్టాటిస్టిక్స్‌ రికార్డ్‌ పూర్తిచేసి ఇటీవల అధ్యాపకురాలికి సబి్మట్‌ చేశాడు. అందులో కరెక్షన్స్‌ ఉన్నాయంటూ ఆమె రికార్డ్‌ను రిజెక్ట్‌ చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్లు చేసినా అధ్యాపకురాలు రికార్డ్‌ తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్‌ చేసి సబి్మట్‌ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళదామని తల్లిదండ్రులు చెప్పారు. 

ముందు మీరు వెళ్లండి, నేను తరువాత వస్తా.. అని సాయితేజ తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా.. సాయితేజ రాలేదు. ఫోన్‌ కూడా తీయలేదు. దీంతో ఇసుకతోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించి, అతడిని మెడికవర్‌ హాస్పటల్‌కు తరలించారు. అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఎంవీపీ పోలీసులు అక్కడికు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.  

ఏడాదిగా లైంగిక వేధింపులు  
ఏడాది కాలంగా సాయితేజ ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులకు గురవుతున్నట్లు సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. సహచర విద్యార్థులతో పాటు తమ్ముడికి కూడా సాయితేజ చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. ఒక అధ్యాపకురాలు ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్‌ చేయడంలేదు.. నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్‌కి వస్తావా?.. నాగురించి ఒకసారైనా ఆలోచించవా..’ వంటి మెసేజ్‌లు పంపటంతోపాటు తరచు వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు సాయితేజ చెప్పాడని స్నేహితులు తెలిపారు. మరో అధ్యాపకురాలు సబ్జెక్ట్‌ పరంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు.

 సాయితేజ ఆత్మహత్యకు కారణమైన ఆ ఇద్దరు మహిళా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలంటూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం లైంగిక వేధింపులకు సంబంధించిన వాట్సాప్‌ సందేశాల జిరాక్స్‌లను ఏబీవీపీ ప్రతినిధి నితిన్‌తో కలిసి కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావుకు అందజేశారు.  సాయితేజ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఫిర్యాదుతో పాటు వాట్సాప్‌ సందేశాల ప్రతులను కూడా పోలీసులకు అందించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement