అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న వైజాగ్‌ అమ్మాయి

Vizag Girl Jyothi Yarraji Shines in National Level Athletics - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ఓ ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డు కూతురే జ్యోతి యర్రాజి. జాతీయ అథ్లెట్‌ జట్టుకు ఎంపిక అవ్వాలన్న లక్ష్యంతో ఆరేళ్ల వయసు నుంచి ఎంతో కృషి చేసింది. జాతీయ అథ్లెట్‌ క్యాంప్‌కు అర్హత సాధించింది. అనుకోకుండా గాయం బారిన పడటం, తదనంతరం కరోనాతో శిక్షణ శిబిరం నడవకపోవడంతో కాస్త విరామం వచ్చింది. ఇటీవలే మీట్‌లు నిర్వహిస్తుండటంతో చురుగ్గా తనకిష్టమైన హార్డిల్స్‌లోనే సత్తాచాటేందుకు సిద్ధమైంది. వరల్డ్‌ 100 మీటర్ల హార్డిల్స్‌లో 347వ ర్యాంక్‌లో, వుమెన్‌ ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో 3,487వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.  

కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన
100 మీటర్ల హర్డిల్స్‌ తన బెస్ట్‌ ఛాయిస్‌ అంటున్న జ్యోతి 100, 200 మీటర్ల పరుగులోనూ జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శన చేస్తోంది. 100 మీటర్ల పరుగును 11.61 సెకన్లలోనే పూర్తి చేయగా, 200 మీటర్ల పరుగును 24.35 సెకన్లలో పూర్తి చేసి కెరీర్‌లో బెస్ట్‌ సాధించింది. ఇక 100 మీటర్ల హర్డిల్స్‌ను కొయంబత్తూర్‌లో 14.92 సెకన్లలోనూ పూర్తి చేసింది. మూడ్‌బిద్రిలో జరిగిన మీట్‌లో మంచి ప్రతిభ సాధించింది.

గత నెలలో జరిగిన నేషనల్‌ మీట్‌లో మూడు అంశాల్లో పాల్గొని జ్యోతి చక్కటి ప్రతిభ కనబరిచింది. 100 మీటర్ల పరుగును 13.43 సెకన్లలో, 200 మీటర్ల పరుగును 24.35 సెకన్లలో పూర్తి చేసిన జ్యోతి ఇదే వేదికపై 13.09 సెకన్లలోనే 100 మీటర్ల హార్డిల్స్‌ను పూర్తి చేసింది. 


రికార్డే.! నమోదు కాలేదు 

ఇటీవల నిర్వహించిన ఆల్‌ ఇండియా అంతర వర్సిటీల అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి రికార్డు వేగంతో పూర్తి చేసి స్వర్ణాన్ని అందుకుంది. జ్యోతి 13.09 సెకన్లలోనే 100 మీటర్ల హార్డిల్స్‌ను పూర్తి చేసింది. జాతీయ రికార్డు 13.38 సెకన్లగానే ఉంది. అయితే ఈ మీట్‌లో విండ్‌ వేగం 2.1గా ఉండటం, ఈ మీట్‌లో నాడా టెక్నికల్‌ డెలిగేట్‌ లేకపోవడంతో చక్కటి అవకాశాన్ని కోల్పోయింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top