లైఫ్‌ ఈజ్‌ రయ్‌రయ్‌

Visakhapatnam: Woman Auto Drivers Inspirational Journey - Sakshi

ఆటో డ్రైవర్లుగా రాణిస్తున్న వాణికుమారి, నూకలక్ష్మి

ఆత్మవిశ్వాసంతో ముందడుగు

సింథియా (విశాఖ పశ్చిమ): అవమానాలు ఎదుర్కొంది..సమాజ వివక్షకు గురైంది..అయినా ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. నా అన్నవాళ్లు ఎవరూ లేకపోయినా తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంది. తలెత్తుకుని తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆటో డ్రైవర్‌గా దూసుకుపోతూనే సేవా కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి చాటుకుంటోంది.  

జీవీఎంసీ 62వ వార్డులో ఉంటున్న 28 ఏళ్ల గొందేశి నూకలక్ష్మి. దశాబ్ద కాలం నుంచి ఎన్నో అవమానాలను, సమాజ వివక్షను తట్టుకుని నూకలక్ష్మి నిలబడిన వైనం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. 2013లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పొంది, ఆటో స్టీరింగ్‌ పట్టుకోగా ఆటో డ్రైవర్‌గా ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంటోంది. గాజువాక నుంచి సింథియా వరకు ఎంతో మంది ప్రేమాభిమానాలను సంపాదించుకోగా, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదుల, విద్యార్థులకు ఆమెకు విశ్వయనీయ ఆటో డ్రైవర్‌గా  ఉండడం విశేషం.

జెండర్‌ సమస్య కారణంగా ప్రయాణికులు నూకలక్ష్మి డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తన ఆటో నుంచి బరువైన వస్తువులను లోడింగ్, అన్‌లోడ్‌ చేసే విషయంలో పురుషుల సహాయాన్ని సైతం నిరాకరించడం నూకలక్ష్మి ఆత్మబలానికి నిదర్శనం గాకా, వృద్ధులు, గర్భిణుల నుంచి డబ్బులను కూడా తీసుకోకపోవడం తన ఉదార స్వభావానికి నిదర్శనం.

అయితే డ్రైవింగ్‌ అంత ఈజీ కాదని. అందులోను ఆటో నడపడం అనేది అస్సలు సులభతరం కాదని. అనాథనైన తాను డాక్‌యార్డ్‌లో పని చేస్తూ ఆటో నడపడం నేర్చుకున్నానని చెప్పింది. 8 ఏళ్ల నుంచి ఆటో నడుపుకుంటూ సమాజంలో గౌరవంగా తలెత్తుకుంటూ జీవిస్తున్నానని చెప్పింది. తన సంపాదనలో కొంత పేదవృద్ధులకు, అనాథలకు ఇవ్వడం, తనలాగే ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి తోచిన సాయం చేస్తున్నట్టు నూకలక్ష్మి చెప్పింది.  

ఆటో నడుపుతూ గౌరవంగా..
డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): ఒక్కొక్కరిది ఒక్కో బతుకు పోరు. పురుషులతో సమానంగానే మహిళలు కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. భర్త తెచ్చే ఆదాయం చాలక..పిల్లల చదువులు..ఇంటి అవసరాలు..ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా మహిళలు కూడా పనులు చేసుకుంటూ ఆర్థిక భాగస్వాములవుతున్నారు. ఆరిలోవకు చెందిన వాసంశెట్టి వాణికుమారి 22ఏళ్లకు పైగా ఆటో నడుపుతోంది. ఈమెకు భర్తలేడు. కుమార్తె బేబీ  డిగ్రీ పూర్తి చేసింది.  ఆరిలోవ..జగదాంబ జంక్షన్, తిరిగి జగదాంబ జంక్షన్‌–ఆరిలోవ వరకు టిక్కెట్‌ సర్వీస్‌ చేస్తోంది. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా టిక్కెట్‌ సర్వీస్‌ చేస్తోంది. ఓ వైపు ఆటో రుణం తీరుస్తూ, మరో వైపు కుమార్తె బాగోగులు, ఇంకోవైపు కుటుంబ పోషణకు తనకొచ్చే ఆదాయంతోనే సరిపెట్టుకుంటున్నామని చెప్పింది. తనకు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందని, రుణం తీసుకుని  తానే ఆటోను సొంతగా కొనుగోలు చేశానని, ఎవరూ సాయం చేయలేదని చెప్పింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top