‘క్లీన్‌సిటీ’ల్లో విశాఖకు నాలుగో స్థానం | Sakshi
Sakshi News home page

‘క్లీన్‌సిటీ’ల్లో విశాఖకు నాలుగో స్థానం

Published Fri, Jan 12 2024 5:36 AM

Visakhapatnam ranks fourth in clean cities - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ :  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌–2023 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఫైవ్‌స్టార్‌ రేటింగ్స్‌తో నాలుగు కార్పొరేషన్‌లు ‘క్లీన్‌సిటీ’ అవార్డులను సొంతం చేసుకుని దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్‌ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి.

ముఖ్యంగా గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆలిండియా 4వ ర్యాంకు, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 6వ ర్యాంకు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 8వ ర్యాంకు లభించగా.. హైదరాబాద్‌ తొమ్మిది, ఇండోర్‌ మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే, ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీ విభాగంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2వ ర్యాంకు లభించింది. ఇక సీఎం వైఎస్‌ జగన్‌ నియోజకవర్గమైన పులివెందులకు ‘క్లీన్‌ సిటీ ఆఫ్‌ ఏపీ’ అవార్డు లభించింది.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ రూపొందించిన సర్వీస్‌ లెవల్‌ ప్రోగ్రెస్, సర్టిఫికేషన్, సిటిజన్‌ వాయిస్‌కి సంబంధించి 9,500 మార్కులకు గాను గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) 8,879.25 మార్కులు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే  చెత్తరహిత నగరాల్లో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను విశాఖ సాధించింది. మరోవైపు.. 

2021, 2022, 2023 సంవత్సరాలలో గ్రేటర్‌ విశాఖ బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్, క్లీన్‌ బిగ్‌ సిటీ.. విజయవాడ కార్పొరేషన్‌ ఇండియా క్లీనెస్ట్‌ సిటీ, క్లీన్‌ స్టేట్‌ క్యాపిటల్‌ జాతీయ అవార్డులను వరుసగా సాధించి హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్నాయి.  

ఇక తిరుపతి నగరం బెస్ట్‌ స్మాల్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ (2021), సఫాయిమిత్ర సురక్షిత్‌ ప్రెసిడెంట్‌ అవార్డు (2022), జాతీయ అవార్డు (2023) దక్కించుకుంది.  

పుంగనూరు పురపాలక సంఘం 2021, 2022లో బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ అవార్డును, పులివెందుల 2022లో ఇన్నోవేషన్, బెస్ట్‌ ప్రాక్టీస్‌ అవా­ర్డు, 2023లో స్టేట్‌ అవార్డును దక్కించుకున్నాయి.  

పెరిగిన స్టార్‌ రేటింగ్‌ నగరాలు.. 
ఇదిలా ఉంటే.. గతేడాది కంటే ఈసారి ఎక్కువ నగరాలు స్టార్‌ రేటింగ్‌ ర్యాంకింగ్‌లో నిలిచాయి. గార్బేజ్‌ ఫ్రీ సిటీ రేటింగ్‌లో గతేడాది జీవీఎంసీ, తిరుపతికి మాత్రమే ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ వచ్చాయి. ఈసారి విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ, తిరుపతి నగరాలూ ఈ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. వీటితోపాటు కర్నూలు, వైఎస్సార్‌ కడప 3 స్టార్‌ రేటింగ్‌లోను, బొబ్బిలి, పులివెందుల, రాజమండ్రి 1 స్టార్‌ రేటింగ్‌లోను నిలిచాయి.  

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం.. 
ఢిల్లీలోని భారత్‌ మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను గురువారం ప్రదానం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హారి్థప్‌సింగ్‌ పూరీ చేతుల మీదుగా మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌లు, అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ అవార్డులు అందుకున్నారు. పారిశుధ్యం విభాగంలో సర్వే, టెస్ట్‌ ప్రాక్టీస్, సిటీజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది.

దేశవ్యాప్తంగా నాలుగు వేల పట్టణ స్థానిక సంస్థలు పోటీపడగా ఏపీ టాప్‌–10లో నిలవడం విశేషం. అనంతరం.. ఏపీ భవన్‌లో విశాఖపట్నం మేయర్‌ గొలగాని వెంకటకుమారి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, తిరుపతి మేయర్‌ శిరీష యాదవ్, పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు.  

సీఎం జగన్‌ ఆలోచనతోనే సాధ్యం 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన విధానంతోనే దక్షిణ భారతదేశంలో ఏపీ టాప్‌–1గా నిలిచిందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమాన్ని వైఎస్‌ జగన్‌ రెండు కళ్లుగా చూశారని, అభివృద్ధి అనేది సమస్యగా కాకుండా ఒక అవకాశంగా తీర్చిదిద్దారన్నారు. ఒకటే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర విభజన ద్వారా అందరికీ అర్థమైందని చెప్పారు.

ఆ పరిస్థితులు ఏపీలో పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలకు ఒక అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటుచేసి ఆయా ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పిలుపులో భాగంగా మున్సిపల్‌ కారి్మకులు ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, తడి–పొడి చెత్తలను వేరుచేయడం, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను అత్యంత హుందాగా, శ్రద్ధగా చేసినట్లు చెప్పారు.

మరోపక్క.. రోడ్లు, పారిశుధ్యం,  డ్రెయినేజీలు, మొక్కలు నాటడం, జంక్షన్ల అభివృద్ధి వంటి వాటిని అభివృద్ధి చేయడంవల్లే ఇది సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలు.. పట్టణాలు టాప్‌ ర్యాంకులు సాధించి అవార్డులు అందుకుంటాయని ఆదిమూలపు సురేష్‌ ధీమా వ్యక్తంచేశారు. 

Advertisement
 
Advertisement