విశాఖ బీచ్‌లో విషాదాలు ఉండవిక.. రాకాసి అలలపై నజర్‌!

Visakhapatnam Beach RIP Current Police Department Tourists - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో కవ్వించే అలలతో పోటీ పడుతూ.. సరదాల్లో మునిగి తేలే పర్యాటకుల్ని అమాంతం పొట్టన పెట్టుకుంటున్నాయి రాకాసి అలలు. రిప్‌ కరెంట్‌గా పిలిచే ఇలాంటి రాకాసి అలలు కడలి మాటున దాగి ఉంటూ వేటు వేస్తుంటాయి. చీలిక ప్రవాహాలుగా పేర్కొనే వీటినుంచి సందర్శకుల్ని రక్షించేందుకు విశాఖ పోలీసులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. రిప్‌ కరెంట్‌పై ముందస్తు సమాచారం అందించే వెబ్‌సైట్‌ ద్వారా ఆయా బీచ్‌లలో హెచ్చరికలు జారీ చేసి, సందర్శకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 

రిప్‌ కరెంట్‌ అంటే.. 
బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్‌ కరెంట్‌ అంటారు. ఇవి మనిషిని ఒక్కసారిగా లోతైన ప్రవాహంలోకి లాగేస్తాయి. సము­ద్ర గర్భంలోని సుదూర ప్రాంతంలో గాలి ద్వారా ఏర్పడిన అలలు.. నీటి అడుగున బలమైన ప్రవాహంగా తీరం వైపు దూసుకొస్తా­యి. తీరానికి వచ్చేసరికి అవి రాకాసి అలలు­గా మారిపోతాయి. అల ఒక్కసారిగా తీరాన్ని తాకినప్పుడు సముద్రం అడుగున అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది.

ఈ కెరటాలు తిరిగి వెళ్లేటప్పు­డు తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడుతుంటాయి. రిప్‌ కరెంట్‌ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకూ ఉంటుంది. ఇలాంటి అల చీలికతో ఒడ్డుకు సమాం­తరంగా 10 నుంచి 290 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఈ ప్రవాహంలో ఎవరు ఉన్నా.. రెప్పపాటులో సముద్రంలోపలికి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో గజ ఈతగాళ్లు కూడా దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం.

విశాఖ తీరంలో ఎన్నో విషాదాలు 
విశాఖ సాగర తీరంలో 2018లో 55 మంది, 2019లో 51 మంది, 2020లో 64 మంది, 2021లో 63 మంది మృత్యువాత పడగా.. గతేడాది 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, సాగర నగర్, రుషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్‌ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో వాటిపై నిలబడి సాగర అందాలను వీక్షిస్తుంటారు. కొంతమంది అక్కడే సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు.

విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండటంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్‌ కరెంట్‌ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్‌ కరెంట్‌ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్నవారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్‌గార్డ్స్‌ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్‌ కరెంట్‌ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడటం అసాధ్యం. 

సందర్శకుల భద్రతకు పెద్దపీట 
ఎంవోఎస్‌డీఏసీ డాట్‌ జీవోవీ డాట్‌ ఐఎన్‌ అనే వెబ్‌సైట్‌లో రిప్‌ కరెంట్‌ సమాచారం ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలతో లభిస్తుంది. ఇలా వచ్చే ముందస్తు సమాచారం ద్వారా రిప్‌ కరెంట్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ రిప్‌ కరెంట్‌ ప్రభావం లేనిపక్షంలో సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతిస్తాం. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. 
– సీహెచ్‌ శ్రీకాంత్, నగర పోలీస్‌ కమిషనర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top