‘బాబూ.. ఏపీ అంటే అమరావతి ఒక్కటేనా?’ | Visakha Steel Plant Narsinga Rao Serious On CBN | Sakshi
Sakshi News home page

‘బాబూ.. ఏపీ అంటే అమరావతి ఒక్కటేనా?’

Jan 4 2025 11:05 AM | Updated on Jan 4 2025 12:33 PM

Visakha Steel Plant Narsinga Rao Serious On CBN

సాక్షి, విశాఖపట్నం: ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది.. రాష్ట్రం పట్ల వివక్షత చూపిస్తోందన్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు. ఇదే సమయంలో ప్రధాని మోదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనులు ఇచ్చే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే, చంద్రబాబు సర్కార్‌కు రాష్ట్రం అంటే అమరావతి ఒక్కటేనా అని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్. నరసింగరావు విశాఖలో మీడియాతో​ మాట్లాడుతూ..‘ప్రధాని మోదీ విశాఖ వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్‌లకు సొంత గనులు ఉన్నాయి. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు ఇచ్చే ప్రకటన ప్రధాని చేయాలి. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇంకా పుట్టక ముందే గనులు ఇవ్వాలని చూస్తున్నారు. కేంద్రం.. ఏపీ పట్ల వివక్షతో వ్యవహరిస్తుంది. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోంది.  

లేని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు అడగటం కాదు.. ఉన్న స్టీల్ ప్లాంట్‌కు గనులు ఇవ్వండి. ప్రధాని వస్తున్న సందర్బంగా కానుకగా స్టీల్ ప్లాంట్‌లో 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే కుట్ర జరుగుతోంది. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ఇచ్చిన ప్రాధాన్యత వైజాగ్ స్టీల్‌కు ఎందుకు ఇవ్వరు?. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 115 శాతం ఉత్పత్తి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అమ్ముడుపోయింది. రాష్ట్రం అంటే ఈ ప్రభుత్వానికి అమరావతి ఒక్కటేనా?. అమరావతి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే. షీలానగర్‌లో కడుతున్న ఈఎస్‌ఐ ఆసుపత్రికి సంబంధించిన మెడికల్ కాలేజీ కూడా అమరావతికి తీసుకుపోయారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరగబోతుంది. ఉత్తరాంధ్రకు హైకోర్టు బెంచ్ ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.

ప్రధాని పర్యటన సందర్బంగా మూడు రోజులపాటు నిరసనలు కొనసాగుతాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్‌లో నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తారు. ఈనెల 6వ తేదీ కుర్మాన్నపాలెం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది. 7వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కొనసాగుతుంది. అడుగడుగునా నల్ల జెండాలతో నిరసన తెలుపుతాం అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement