సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలే శరణ్యం
గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ అల్టిమేటం
మెమోలు, షోకాజ్ వేధింపులు, సస్పెన్షన్లు ఆపకపోతే సహించేది లేదని హెచ్చరిక
తిరుపతి అర్బన్: గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి భూముల రీ సర్వేను బహిష్కరిస్తామని గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ హెచ్చరించింది. సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ఆందోళనలకైనా సిద్ధమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మహాప్రస్థానం పేరిట రాష్ట్రస్థాయిలో గ్రామ సర్వేయర్ల సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు మాట్లాడుతూ.. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పరిష్కారం చూపాలనిడిమాండ్ చేశారు.
లేదంటే పోరాటాలకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నా చిన్నచిన్న సాకులు చూపిస్తూ పదేపదే మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా సస్పెన్షన్ విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రీసర్వే విధుల్లో ఉంటున్న గ్రామ సర్వేయర్ల ప్రయాణ భత్యం, కరువు భత్యం, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్‌నాయుడు మాట్లాడుతూ.. జాబ్ చార్టులకు విరుద్ధంగా జాయింట్ ఖాతాల తొలగింపు, పట్టాదారులను నిర్ణయించడం తదితర కీలక అంశాలు రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంటే బలవంతంగా సర్వేయర్లపై రుద్దడం తగదన్నారు. లాప్‌టాప్‌లు, రోవర్లు, స్టేషనరీ సరిపడినంతగా సరఫరా చేయకుండా ఇక్కట్లకు గురిచేస్తున్నారని వెల్లడించారు.
రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 4,722 మంది గ్రామ సర్వేయర్లను సర్వే సంబంధిత శాఖల్లో కౌన్సెలింగ్ విధానంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గ్రేడ్–1కి సంబంధించి పదోన్నతులు 70శాతం ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. ఐదేళ్ల సర్వే పూర్తి చేసుకున్న వారికి కనీస బేసిక్ రూ.32 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


