మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా విలేజ్‌ క్లినిక్స్‌ 

Village clinics aim at better medical services Andhra Pradesh - Sakshi

సీహెచ్‌వోల పనితీరుపై నెలనెలా సమీక్ష

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించడమే వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా విలేజ్‌ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల (సీహెచ్‌వోల) పనితీరును ప్రతినెలా సమీక్షించనున్నారు.  ఇందుకు అనుగుణంగా సూచీల­ను ఖరారు చేశారు.

ఆయా సూచీల్లో సీహెచ్‌వోలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరును అంచనా వేస్తారు. గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్‌ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వారిని సీహెచ్‌వోలుగా నియమించింది.  

14 అంశాల ఆధారంగా.. 
సీహెచ్‌వోలు ప్రజలకు అందించే సేవలతోపాటు వారి పనితీరును అంచనా వేయడానికి 14 అంశాలను ఖరారు చేశారు. ఈ అంశాల్లో నెల రోజుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరు అంచనా వేస్తారు. సాధారణంగా సీహెచ్‌వోలకు వైద్య శాఖ నెలకు రూ.15 వేల వరకూ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకం అందిస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రోత్సాహకం అందించడానికి పనితీరు అంచనాలను ప్రామా­ణికంగా తీసుకుంటారు. విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోని ప్రజలకు ఓపీ, టెలీ మెడిసిన్‌ సేవల కల్పన, హైరిస్క్‌ గర్భిణుల గుర్తింపు, వీరికి కౌన్సెలింగ్‌ చే­యడం, ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో చిన్నారుల రిజిస్ట్రేషన్, ఏడాదిలోపు పిల్లలకు ఫుల్‌ ఇమ్యూనైజేషన్, ఎన్‌సీడీ సర్వే పురోగతి వంటి 14 అంశాల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరు అంచనా ఉంటుంది.  

12 రకాల వైద్య సేవలు 
విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు 12 రకాల వైద్య, 14 రకాల పరీక్షల సేవలు అందిస్తోంది. 67 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. టెలీ మెడిసిన్‌ ద్వారా పీహెచ్‌సీ వైద్యుడితోపాటు హబ్‌లోని జనరల్‌ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిషన్‌ వంటి స్పెషలిస్ట్‌ వైద్యుల కన్సల్టేషన్‌ సేవలు ప్రజలకు అందుతున్నాయి. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులు నెలలో రెండుసార్లు విలేజ్‌ క్లినిక్‌లను సందర్శిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top