సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం నగర ప్రజలను ముంచేసింది. ప్రజలను అప్రమత్తం చేయని అధికారులు.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బుడమేరు 11 గేట్లు ఎత్తివేశారు. బుడమేరు గేట్లు ఎత్తేయడంతో కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగిపోయింది.

షాబాదు, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, గొల్లపూడి రోడ్డు, సితార సెంటర్, మిల్క్ ఫ్యాక్టరీ, ఊర్మిళా నగర్, రామరాజ్య నగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్,ఇందిరా నాయక్ నగర్, ఆంధ్రప్రభకాలనీలను బుడమేరు వరద ముంచెత్తింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోలేదు. బుడమేరు వరదతో నగరం నీట మునిగింది.

ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. 5 లక్షల క్యూసెక్కులు దాటటంతో బుడమేరు నీరు కాలనీల్లోకి ప్రవహిస్తోంది. ప్రజలను కనీసం అప్రమత్తం చెయ్యని ప్రభుత్వం, అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించలేదు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తున్న కూడా అధికారులు అప్రమత్తం చేయలేదు.
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
