శ్రమజీవుల సమర గర్జన | Vijayawada dharna chowk erupts with slogans | Sakshi
Sakshi News home page

శ్రమజీవుల సమర గర్జన

Jul 8 2026 3:12 AM | Updated on Jul 8 2026 3:13 AM

Vijayawada dharna chowk erupts with slogans

చంద్రబాబు దగా పాలనపై ధ్వజం 

కదంతొక్కిన మున్సిపల్‌ కార్మికులు  

ఆప్కోస్‌ను రద్దు చేసే కుట్రలపై రణభేరి  

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌   

నినాదాలతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్‌  

సాక్షి, విజయవాడ: లక్ష ఉద్యోగాలంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు సర్కారు.. ఉన్న శ్రమజీవులకు ఉద్యోగ భద్రత కల్పించాలని  మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు, అనుబంధ విభాగం ఏఐటీయూసీ నేతలు డిమాండ్‌ చేశారు. కార్మికులకు రక్షణగా ఉన్న ఆప్కోస్‌ వ్యవస్థను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. లేదంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మున్సిపాలిటీల్లో సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే విధానాలను మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కార్మికులు బెజవాడకు పోటెత్తారు. 

ధర్నా చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా గళమెత్తారు. ధర్నాచౌక్‌ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు మాట్లాడుతూ మంత్రి లోకేశ్‌ లక్ష ఉద్యోగాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఆయన ఉన్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తే చాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరొకలా ప్రవర్తిస్తారని ధ్వజమెత్తారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు 
చంద్రబాబు ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరిట మున్సిపాలిటీల్లో సేవలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర చేస్తోందని కార్మిక నేతలు విమర్శించారు. మున్సిపల్‌ కార్మికులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించిందని, కానీ గత ఎన్నికల సమయంలో లోకేశ్‌ మున్సిపల్‌ కార్మికులకు తాము కూడా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పడం బాధాకరమని ధ్వజమెత్తారు. 

గతంలో విజయవాడలో వరదలు వస్తే బయటి ప్రాంతాల నుంచి 10 వేల మంది కార్మికులను తరలించారని గుర్తు చేశారు. అనంతరం  కార్మికులు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో తీవ్ర తోపులాట జరిగింది. బారికేడ్లను దాటేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు నెట్టేశారు. దీంతో కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దాస్, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.సుబ్బారాయుడు, వెంకటసుబ్బయ్య, కోటిదాసు, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement