వీజీఎఫ్‌ సర్దుబాటు చేస్తేనే కాకినాడలో పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌

Vijaya Sai Reddy Comments On Petrochemical Complex in Kakinada - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీ ఎఫ్‌) సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వస్తేనే కాకినాడలో పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కాకినాడలో రూ.32,901 కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కోసం 2017 జనవరి 27న ఏపీ ప్రభుత్వం గెయిల్, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్లతో ఎంవోయూ కుదుర్చుకు న్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలంటే వీజీఎఫ్‌ను ఏపీ ప్రభుత్వమే భరించాలని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

కాచ్‌ ద రైన్‌ క్యాంపెయిన్‌ కింద ఏపీలో 7.97 లక్షల పనులు
కాచ్‌ ద రైన్‌ క్యాంపెయిన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 7,97,502 పనులు నిర్వహించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు చెప్పారు. 

ఖరగపూర్‌–విజయవాడ మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌
ఖరగపూర్‌–విజయవాడ (1,115 కిలోమీటర్లు), విజయవాడ–నాగపూర్‌ (975 కిలోమీటర్లు) మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మాణానికి రైల్వేశాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. నేషనల్‌ మినరల్‌ పాలసీ కింద డెడికేటెడ్‌ మినరల్‌ కారిడార్లు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారీ సరుకులతో పొడవాటి ట్రైన్ల ద్వారా రవాణా చేసేలా రూపుదిద్దుకుంటాయని తెలిపారు.

స్మార్ట్‌ నగరాల్లో 776 స్మార్ట్‌ రోడ్‌ ప్రాజెక్టులు
2015లో ప్రారంభమైన స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ (ఎస్‌సీఎం) కార్యక్రమంలో భాగంగా 2016 నుంచి 2018 వరకు 100 స్మార్ట్‌ నగరాలను ఎంపిక చేసినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి తెలిపారు. స్మార్ట్‌ సిటీల్లో నడకను మెరుగుపరచడానికి, మోటారు లేని, ప్రజారవాణా వినియోగాన్ని పెంచడానికి రూ.26,205 కోట్ల విలువైన 776 స్మార్ట్‌ రోడ్‌ ప్రాజెక్టులు అమలవుతున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 

ఖనిజాల రాయల్టీ రేట్ల సమీక్షకు కమిటీ
ఖనిజాలపై టన్ను ప్రాతిపదికన రాయల్టీ రేట్ల సమీక్ష కోసం ఒక కమిటీని గత అక్టోబర్‌లో ఏర్పాటు చేసినట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం (ఎంఎండీఆర్‌) సవరణ తర్వాత వేలంలో క్యాప్టివ్‌ ప్రయోజనం కోసం ఎటువంటి గనిని రిజర్వ్‌ చేయరాదని, క్యాప్టివ్‌ మరియు నాన్‌ క్యాప్టివ్‌ గనుల మధ్య వ్యత్యాసం తొలగించామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 

8 రాష్ట్రాల్లో 8 నగరాలకు నిధులు 
15వ ఆర్థిక సంఘం 8 కొత్త నగరాల ఇంక్యుబేషన్‌ కోసం పనితీరు ఆధారిత చాలెంజ్‌ ఫండ్‌ కోసం రూ.8 వేల కోట్లు కేటాయించిందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. బిడ్‌ పారామితులను పేర్కొనడానికి వచ్చే జనవరి 31 నాటికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

అమృత్‌ నగరాల్లో క్రెడిట్‌ రేటింగ్స్‌ పనులు పూర్తి
దేశంలోని 470 అమృత్‌ నగరాల్లో క్రెడిట్‌ రేటింగ్‌ పనులు పూర్తయ్యాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి కౌశల్‌కిశోర్‌ తెలిపారు. ఈ క్రెడిట్‌ రేటింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 నగరాలున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top