తక్షణం రూ. 381 కోట్ల బకాయిలు పేదలకు చెల్లించాలి
నిరుపేదల వేతనాలు ఇప్పించే బాధ్యత పవన్‌కు లేదా?
వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18.63 లక్షల నిరుపేద ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తొలగించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వారి పొట్ట కొడుతోందని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జూలై 27 నుంచి డిసెంబర్ వరకు పెండింగ్ ఉపాధి కూలీల వేతన బకాయిలు రూ.381 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 18.63 లక్షల జాబ్ కార్డుల తొలగింపుపై పంచాయతీరాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంపీడీవోలకు డీడీఎల్‌వోలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ పదోన్నతి కల్పించి వారికి ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేస్తే, ఆ పేరుని డీడీవోలుగా మార్చి తానే ప్రమోషన్ ఇచ్చినట్టు పవన్ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పవన్ కూడా చంద్రబాబు నుంచి క్రెడిట్ చోరీ నేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు యూరియా కూడా సరఫరా చేయకుండా వ్యవసాయ రంగాన్ని నిరీ్వర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరికి ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వేతనాలు కూడా ఇవ్వకుండా వేధిస్తోందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పల్లెల్లో బెదిరింపుల పర్వానికి తెరదీసిందని, అందులో భాగంగానే టీడీపీ మద్దతుదారులకే జాబ్ కార్డులు ఉంచి మిగతా వారి కార్డులను రకరకాల కారణాలతో ఏరివేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పేదలకు అడిగినంత పని కల్పించగా.. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి పని దినాలు కల్పించడంలోనూ విఫలమైందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2023–24లో రాష్ట్రంలో ఏప్రిల్ – నవంబరు మధ్య 21.37 కోట్ల పనిదినాలు కల్పించగా, చంద్రబాబు సర్కారు 2025–26 ఏప్రిల్ నుంచి డిసెంబరు 7వతేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించిందన్నారు.
సినిమా టికెట్ రేట్ల మీద ఉన్న శ్రద్ధ పేదల మీద ఏదీ?
ఒకపక్క 7.4 లక్షల కుటుంబాలకు 18.63 జాబ్ కార్డుల తొలగింపు.. మరోవైపు ఐదున్నర కోట్ల పనిదినాల కోత.. ఇంకోవైపు ఉపాధి పనులనే నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలకు వేతనాలు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తున్నా డిప్యూటీ సీఎం పవన్ నోరు మెదపడంలేదని దుయ్యబట్టారు. తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉపాధి హామీ కూలీలపై పెట్టడం లేదన్నారు. ఉపాధి కూలీలు అని పిలవొద్దని కల్ల»ొల్లి మాటలతో పవన్ సరిపుచ్చుతున్నారని విమర్శించారు.


