వ్యాపారాలను అడ్డుకుంటూ బెదిరిస్తున్న టీడీపీ కూటమి నేతలు
వారికే వత్తాసు పలుకుతున్న పోలీసులు, అధికారులు
దొనకొండ మండలంలో డీలర్‌షిప్ వదులుకోవాలని బెదిరించడం దుర్మార్గం
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరిపోయాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ విజయవాడ పశి్చమ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు టీడీపీ నేతలు ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడుతున్నారని, మరోవైపు అధికారులు, పోలీసులను అడ్డంపెట్టుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. దర్శి నియోజకవర్గంలో డీలర్‌షిప్ వదులుకోవాలని శ్రీరామ్ వెలుగొండ రామయ్యను బెదిరించడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు.
‘మొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిలిలో వ్యాపారి అవినాష్, ఆయన తండ్రిపై అమానుషంగా దాడి చేసి కొట్టారు. నేడు దర్శి నియోజకవర్గంలోని గంగదేవిపల్లిలో దశాబ్దకాలంగా రేషన్ డిపో నిర్వహిస్తున్న శ్రీరామ్ వెలుగొండ రామయ్యపై వేధింపులకు పాల్పడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీలర్‌షిప్ వదులుకోవాలని శ్రీరామ్ వెలుగొండ రామయ్యను బెదిరించారు. లేకపోతే ఆయన కుమారుడిని కిడ్నాప్ చేస్తామని హెచ్చరించారు. వారి బెదిరింపులు భరించలేక శ్రీరామ్ వెలుగొండ రామయ్య ఇల్లు వదిలి వెళ్లి దేవస్థానంలో తలదాచుకున్నారు. టీడీపీ కూటమి నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు.’ అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు.
బతకాలంటేనే భయపడుతున్న ఆర్యవైశ్యులు
‘రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు రక్షణ లేదు. అసలు ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు బతకాలంటే భయపడుతున్నారు. వరుస దాడులపై ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇంత ఘోరం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎందుకని ప్రశి్నంచడం లేదు? పొదిలిలో ఆర్యవైశ్యులపై దాడి చేసిన ఎస్‌ఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్యవైశ్యులపై దాడులను అరికట్టాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులమంతా కలిసి తిరుగుబాటు చేస్తాం’ అని వెలంపల్లి హెచ్చరించారు.


