దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు

Vadrevu Chinaveerabhadradu comments on Durgamma Lesson - Sakshi

దుష్ప్రచారాన్ని ఖండించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌

అన్ని మతాల విశిష్టతను వివరిస్తూ ఇతర అంశాల పరిచయం

పాఠ్య పుస్తకాల్లోని 12 పండుగల్లో 8 హిందూ మతానివే  

సాక్షి, అమరావతి: పాఠ్య ప్రణాళిక సంస్కరణల్లో భాగంగా కొత్త పాఠ్యపుస్తకాలను అన్ని మతాల పండుగలు, సంప్రదాయాలు, ధర్మ మార్గం విశిష్టతను తెలియచేసేలా వీలైనంత సమగ్రంగా రూపొందించాలని భావించినట్లు పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘బెజవాడ దుర్గమ్మ తెలుగు పాఠాల నుంచి వెళ్లిపోయింది.. గుణదల కొత్తమాత వచ్చి చేరింది’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదని, 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కొత్త పాఠ్యాంశాలను చేర్చడంలో భాగంగా ఇతర అంశాలను పొందుపరచినట్లు చెప్పారు.

రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు తెలుగు సంస్కృతిని పరిచయం చేసే క్రమంలో వివిధ మతాల ముఖ్యమైన పండగలను పాఠ్యపుస్తకాల్లో చేర్చినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 12 పండుగల్లో హిందూ మతానికి సంబంధించిన 8 ముఖ్యమైన పండుగలు ఉన్నట్లు వివరించారు. మొదటిసారిగా గిరిజనుల పండుగను కూడా పరిచయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల పండుగలను కూడా పరిచయం చేశామన్నారు. శ్రీకాకుళం సవరల పండుగ, విజయనగరం సిరిమానోత్సవం, నెల్లూరు రొట్టెల పండగ, అహోబిలం పార్వేటలతోపాటు విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలను కూడా పరిచయం చేశామని తెలిపారు. ఇలా వివిధ మతాలు, వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా పాఠ్యపుస్తకాలను ఇంక్లూజివ్‌గా రూపొందించడం ఇదే తొలిసారి అని తెలిపారు. అయితే ఇందులో నుంచి ఒక్కటి మాత్రమే ఎంపిక చేసి హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నట్లుగా ట్రోలింగ్‌ చేయడం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top