వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ అవార్డు
సంస్కృతంలో దిట్ట.. రుగ్వేదంలో పట్టు
దేశంలో ఉన్న ప్రముఖ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో వీసీగా విధులు
భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పీఠంలో తొలి ఆచార్యుడు
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షాతిరేకాలు
మరోసారి వార్తల్లో నిలిచిన కృష్ణాజిల్లా టేకుపల్లి గ్రామం
మోపిదేవి/గుడ్లవల్లేరు: పండితులు, విద్వాంసులకు నిలయమైన టేకుపల్లి గ్రామంలో మరో ‘పద్మం’ వికసించింది. వెంపటి కుటుంబ శాస్త్రి(V Kutumba Sastry)కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంతో కృష్ణాజిల్లాలోని ఈ గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. మండలంలోని టేకుపల్లిలో వెంపటి జగన్నాథం, రాజ్యలక్ష్మి దంపతుల ఆరుగురు కుమారుల్లో ఒకరు కుటుంబశాస్త్రి. సంస్కృతంలో దిట్ట. ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నారు. దేశంలో ఉన్న ప్రముఖ సంస్కృత విశ్వవిద్యాలయాలు న్యూఢిల్లీ రా్రïÙ్టయ సంస్కృత సంస్థాన్, వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, గుజరాత్ శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఉప కులపతి (వైస్ చాన్స్‌లర్)గా కుటుంబశాస్త్రి పనిచేశారు.
తిరుమల సంస్కృత విశ్వవిద్యాలయ వీసీగా కూడా పనిచేశారు. భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పీఠంలో తొలి ఆచార్యుడిగా పనిచేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రిగా మురళీమనోహర్ జోషి ఉన్న సమయంలో సంస్కృత సంబంధమైన అనేక పదవులను అలంకరించారు. ప్రస్తుతం సంస్కృతంపై ఈయన లోతైన అధ్యయనం చేస్తున్నారు. తల్లిదండ్రులు వెంపటి రాజ్యలక్ష్మి, జగన్నాథం పేరున ఫౌండేషన్ ఏర్పాటుచేసి స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టేకుపల్లి గ్రామానికి చెందిన అమరగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుకు కూడా గతంలో ‘పద్మశ్రీ’ లభించింది.
కుటుంబ నేపథ్యం..
వెంపటి కుటుంబశాస్త్రి 1950 ఆగస్టు 12న జన్మించారు. ఆయన ఎంఏ పీహెచ్‌డీ చేశారు. తిరుపతిలోని వేద పాఠశాలలో రుగ్వేద అధ్యయాన్ని పూర్తిచేశారు. వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విద్యా ప్రవీణ (ఎంఏ), ప్రాచ్య శీర్షిక పరీక్షలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి శిరోమణి (ఎంఏ), మరో ప్రాచ్య శీర్షిక పరీక్షలో అర్హత సాధించారు. 1992లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని సంస్కృత సాహిత్య పరిషత్ నుంచి వేదాంత కేసరి బిరుదు పొందారు. 2004 ఢిల్లీలోని మందాకిని విద్వత్ పరిషత్ నుంచి విద్యాసాగర్ అవార్డు అందుకున్నారు. ఇలా అనేక అవార్డులు అందుకున్న కుటుంబ శాస్త్రి దివిసీమ వాసి కావడంతో ఈ ప్రాంతం వారు, కుటుంబ సభ్యుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


