‘రీ సర్వే’ను మోడల్‌గా తీసుకున్న ఉత్తరాఖండ్‌  | Uttarakhand has taken Re Survey as a model | Sakshi
Sakshi News home page

‘రీ సర్వే’ను మోడల్‌గా తీసుకున్న ఉత్తరాఖండ్‌ 

May 13 2023 5:08 AM | Updated on May 13 2023 5:08 AM

Uttarakhand has taken Re Survey as a model - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ని­ర్వహిస్తున్న భూముల రీ సర్వే ప్రాజెక్టును ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మోడల్‌గా తీసుకుంది. ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల ఆధునికీకరణ నే­పథ్యంలో ఏపీలో రీ సర్వే జరుగుతున్న తీరును పూర్తిగా అధ్యయనం చేసింది. ఉత్తరాఖండ్‌ అధికారులకు సైతం ఏపీ అధికారులతో ప్రత్యేకంగా శిక్ష­ణ ఇప్పించింది. ఇందులో భాగంగా శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఏపీ సర్వే అ­కాడమీ వైస్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌వీఎస్‌ఎన్‌ కుమార్‌ రీ సర్వే ప్రాజెక్టుపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ముస్సోరిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన లాల్‌ బహదూ­ర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోని బీఎన్‌ యుగంధర్‌ సెంటర్‌ ఫర్‌ రూరల్‌ స్టడీస్‌ ఈ వర్క్‌షాప్‌ నిర్వహించింది. హైబ్రీడ్‌ టెక్నాలజీ ద్వారా ఆధునిక భూముల సర్వే నిర్వహణలో ఏపీకి అపారమైన అనుభవం ఉన్న దృష్ట్యా తాము నిర్వహించే వర్క్‌షాప్‌లో ఉత్తరాఖండ్‌ రెవెన్యూ అధికారులకు దీనిపై శిక్షణ ఇవ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

దీంతో సీహెచ్‌వీఎస్‌ఎన్‌ కుమార్‌ను భూపరిపాలన శాఖ అధికారులు అక్కడికి పంపడంతో ఆయన రీసర్వే ప్రాజె­క్టుపై ప్రజెంటేషన్‌తోపాటు వారికి తగిన సూచన­లు, సలహాలు ఇచ్చారు. డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే నిర్వహిస్తున్న తీరు, గ్రౌండ్‌ ట్రూతింగ్, వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మొబైల్‌ మెజిస్ట్రేట్లు, భూ హక్కు పత్రాల పంపిణీ వంటి పలు అంశాల గురించి వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement