
కల సాకారం చేసుకున్న కడలూరు సిస్టర్స్
సాక్షి, చెన్నై: 2004లో సునామీ సృష్టించిన విలయతాండవం సమయంలో కడలూరులో ఐఏఎస్ అధికారిగా గగన్‌దీప్‌సింగ్ బేడీ పనితీరును చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్ కనులార చూశారు. సునామీ విలయం నుంచి బయటపడిన జీడి పప్పు రైతు కుటుంబంలోని ఈ ఇద్దరు తాము సైతం ఐఏఎస్ కావాలన్న కలతో ముందుకు సాగారు. ఇందులో ఒకరు ఐఏఎస్‌గా, మరొకరు ఐపీఎస్‌గా విధుల్లో చేరి రాణిస్తున్నారు.
కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని మరుంగూర్ గ్రామానికి చెందిన రామనాథన్, ఇలవరసి దంపతుల కుమార్తెలు సుస్మిత, ఐశ్వర్య. ఈ ఇద్దరి మధ్య ఏడాదిన్నర వయస్సు తేడా. 2004లో జరిగిన సునామీ తాండవం సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్‌గా ఉన్న గగన్‌దీప్‌సింగ్ బేడి అప్పట్లో కడలూరులో వీరోచితంగా సేవలు అందించడంలో శ్రమించారు. దీనిని చిన్న పిల్లలుగా ఉన్న సుస్మిత, ఐశ్వర్య చూసి, తాము సైతం ఐఏఎస్‌లు కావాలన్న లక్ష్యంతో చదివారు. అన్నావర్సిటీలో పట్టభద్రులయ్యారు.
కల సాకారం
యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వీరిలో సుస్మిత ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ ఐపీఎస్‌గా కాకినాడలో ఏఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య తమిళనాడులోని తూత్తుకుడి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఏదో ఒక రోజున ఒక జిల్లాకు ఎస్పీగా ఒకరు, ఒక జిల్లాకు కలెక్టర్‌గా మరొకరు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఒకే ఇంటికి చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ విధుల్లో రాణిస్తున్నారు.
తన కుమార్తెల గురించి రామనాథన్ మాట్లాడుతూ తన పిల్లలు ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్‌లుగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ గగన్ దీప్ సింగ్‌బేడి పనితీరును తన ఇద్దరు పిల్లలు ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసులో రాణించి వారి కలను సాకారం చేసుకున్నారని, ఇద్దరు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు.