Rythu Bharosa: ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా

Union Ministers Praises for RBK Services In Andhra Pradesh - Sakshi

అగ్రి విజన్‌ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆర్బీకే స్టాల్‌ 

‘గుడ్‌.. గుడ్‌. వెరీ మచ్‌ ఇంప్రెస్డ్‌’ అంటూ కేంద్ర మంత్రుల ప్రశంస

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న 12వ వ్యవసాయ విజన్‌ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. సదస్సును ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర రవాణా, ఓడ రేవుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి, వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, పర్షోత్తమ్‌ రూపాలా ఆర్బీకే స్టాల్‌ను ఆసక్తిగా తిలకించి, ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవల తీరుతెన్నులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టినవే ఈ ఆర్బీకేలని, వీటిద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి సాగు ఉత్పాదకాలను రైతుల గడప వద్దకు తీసుకెళ్తున్నామని వివరించారు. నాణ్యతా పరీక్షల నిర్వహణ కోసం దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ స్థాయిలో గోదాములతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

చదవండి: (బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేకుండా సుప్రీంకోర్టు న్యాయవాది)

పైసా భారం పడకుండా పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకే స్థాయిలో బ్యాంకింగ్‌ సేవలందిస్తున్నామని వివరించారు. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా మార్చి గ్రామ స్థాయిలోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కమిషనర్‌ చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్న కేంద్రమంత్రులు ‘ఆర్బీకేల గురించి ఇప్పటికే మేం విన్నాం. గుడ్‌.. గుడ్‌. వెరీమచ్‌ ఇంప్రెస్డ్‌’ అంటూ కితాబిచ్చారని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top