ఏపీలోనే నిరుద్యోగం తక్కువ

Unemployment rate is low in Andhra Pradesh - Sakshi

సీఎంఐఈ గణాంకాల్లో వెల్లడి

ఆగస్టులో దేశ సగటు నిరుద్యోగ రేటు 8.3%

ఇదే సమయంలో ఏపీలో 6%గా నమోదు

తెలంగాణ, తమిళనాడు, బెంగాల్, రాజస్తాన్‌ కంటే ఏపీలోనే తక్కువ నిరుద్యోగం

హరియాణాలో అత్యధికంగా 37.3%

సత్ఫలితాలనిస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చర్యలు

ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు పరిశ్రమలకిస్తున్న ప్రోత్సాహంతోనే నిరుద్యోగం తగ్గిందన్న నిపుణులు 

సాక్షి, అమరావతి: దేశంలో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోనే నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. అంతేకాదు దేశీయ సగటు కంటే కూడా ఏపీ నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి జాతీయ సగటు నిరుద్యోగ రేటు 8.3%గా ఉండగా.. ఏపీలో నిరుద్యోగ రేటు 6 శాతమేనని సీఎంఐఈ తెలిపింది.

ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, పంజాబ్‌ వంటి పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఏపీలోనే నిరుద్యోగ రేటు చాలా తక్కువగా ఉంది. తమిళనాడులో 7.2%గా ఉంటే.. తెలంగాణలో 6.9%గా నమోదయ్యింది. దేశంలో అత్యధికంగా హరియాణాలో 37.3%, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ 32.8, రాజస్తాన్‌లో 31.4% ఉండగా.. అత్యల్పంగా చత్తీస్‌గఢ్‌లో 0.4% మేర నిరుద్యోగముంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్రలో 2.2%, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో 2.6%గా నిరుద్యోగ రేటు నమోదయ్యింది. 

ప్రభుత్వ ప్రోత్సాహంతో కోవిడ్‌ను అధిగమించి..
కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. 2020 ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 23.6 శాతానికి చేరగా.. ఏపీలో 20.5 శాతంగా నమోదయ్యింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తీసుకున్న చర్యలతో నిరుద్యోగ రేటు తగ్గుతూ వచ్చింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ విభాగాల్లో కలిపి మొత్తం 6,16,323 మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించింది.

ఇందులో శాశ్వత ఉద్యోగాలు 2,06,638 ఉన్నాయి. ఇవి కాకుండా కోవిడ్‌ సమయంలో పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు మూతపడకుండా.. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే విధంగా చేపట్టిన చర్యలు కూడా సత్ఫలితాలనిచ్చాయి. రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించి ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడం వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించింది.

అలాగే ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం.. ఇప్పటికే పలు సంస్థలు తమ పరిశ్రమలను ప్రారంభించడంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి ఎన్నో నిర్ణయాల వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top