ఏపీలో దారుణం.. భర్తల సాయంతో తోడికోడళ్లను..  

An Uncle Brutally Killed Two Women At Kurnool District - Sakshi

తోడికోడళ్లను కిరాతకంగా చంపిన మామ    ∙ 

ఇందుకు సహకరించిన భర్తలు 

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు  

కాసింత ప్రేమను చూపిస్తే పులకించిపోయేవారు.. ఆత్మీయంగా పలకరిస్తే ఆనందించేవారు..ఒక తోడు దొరికిందని..మంచి నీడన హాయిగా బతకొచ్చని ఆశించారు. పుట్టినిల్లు వదిలి మెట్టినింట అడుగుపెట్టిన ఆ ఇద్దరు ఆడపడుచులకు మామ రూపంలో మూఢ నమ్మకం ఎదురైంది. తండ్రిలా చూసుకోవాల్సిన మామ, తన అనారోగ్యానికి కోడళ్లే కారణమని, చేతబడి చేశారని అనుమానించాడు. నాటు వైద్యుని మాటలు నమ్మి కుమారులనూ పక్కదోవ పట్టించి..అతి కిరాతకంగా కోడళ్లను హతమార్చారు. ఈ దారుణం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. 

ఓర్వకల్లు: చేతబడి చేశారనే మూఢనమ్మకంతో ఇద్దరు కోడళ్లను మామ అతికిరాతకంగా హత్య చేశాడు. ఇందుకు కుమారుల సహాయం తీసుకున్నాడు.  ఓర్వకల్లు  పోలీసులు తెలిపిన వివరాల మేరకు నన్నూరు గ్రామానికి చెందిన కురువ మంగమ్మ, పెద్ద గోవర్ధన్‌(అలియాస్‌ గోవన్న)దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కొడుకు పెద్ద రామ గోవిందుకు గూడూరు మండలం, గుడిపాడు గ్రామానికి చెందిన రామేశ్వరమ్మ(26)తో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. చిన్న కొడుకు చిన్న రామగోవిందు, కల్లూరు మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేణుక(25)ను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కురువ గోవన్న 40 ఎకరాల భూస్వామి కావడంతో కుటుంబ సభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

గోవన్నకు చిన్న కోడలిపై మొదటి నుంచి ఇష్టం లేదు. కోడళ్లు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. గొవన్న అనారోగ్య సమస్యతో సతమతం చెందేవాడు. ఇతరుల సలహా మేరకు రెండు మూడు సార్లు జొహరాపురంలో ఉన్న నాటు వైధ్యుని వద్దకు వెళ్లి చూపించుకోగా సదరు వైద్యుడు పసురు మందు తాపించాడు. ఆ సమయంలో మందు పడినట్లు తెలిసింది. మందును  మీ కోడళ్లే పెట్టించారని, చేతబడి చేశారని  గోవన్నకు చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కోడళ్లపై మామ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని కుమారులకు చెప్పి వారిని పక్కదోవ పట్టించాడు. ఇద్దరు కోడళ్లకు సంతానం కలుగకపోవడంతో వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 

హత్య చేశారు ఇలా.. 
బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామంలోని తడకనపల్లె రస్తాలో ఉన్న సొంత పొలంలో పనులు చేసేందుకు మామ గోవన్న కలిసి ఇద్దరు కోడళ్లు పొలానికి వెళ్లారు. వీరికి తోడుగా పెద్ద రామగోవిందు కూడా వచ్చాడు.  పనులు ముగిశాక, పశువులకు మేతకోసుకరమ్మని గోవన్న ఇద్దరు కోడళ్లను పొరుగు పొలాల్లోకి పంపాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వ్యూహం ప్రకారం ఇద్దరు కొడుకులతో కలిసి గోవన్న గడ్డికోస్తున్న కోడళ్ల వద్దకు వెళ్లాడు. వేపకర్రతో పెద్ద కోడలు రామేశ్వరమ్మ తలపై బలంగా మోదగా  అపస్మారక స్థితిలో పడిపోయింది. ఇది గమనించిన చిన్న కోడలు రేణుక అడ్డుపడగా అదే కర్రతో ఛాతిపై బలంగా మోదడంతో ఆమె కూడా కుప్పకూలింది. కోడళ్లు ఇద్దరూ కోలుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ప్రాణాలు విడిచారని గమనించిన తండ్రీ కొడుకులు ఇంటికి వెళ్లి స్నానాలు చేసి, దుస్తులు మార్చుకొని సాయంత్రం 6 గంటల సమయంలో పొలానికి వెళ్లి డ్రామా ఆడారు. దారుణం జరిగిపోయిందని విలపిస్తూ భార్యల తరఫున బంధువులకు ఫోన్‌ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసు జాగిలాలను పిలిపించి ఘటన స్థలంలో పరిశీలించినా, ఎలాంటి ఆధారాలు లభించలేదు. గోవన్న ఆసుపత్రిలో చేరడంతో పోలీసులు అనుమానించారు.   గోవన్నతోపాటు పెద్దరామగోవిందు, రామగోవిందును అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో వారు నేరం అంగీకరించారు. వీరితో పాటు, మూఢ నమ్మకాలతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ, కాపురాల్లో చిచ్చులు పెడుతున్న నాటు వైద్యునిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top