చైనాలో ఓ వృద్ధురాలిని బెదిరించినందుకుగానూఓ హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అరెస్టు చేశారు!! ఇంటర్నెట్లో ఈ వార్త రాగానే.. ఏంటి బ్రో.. రోబో అరెస్టా? అనినోరెళ్లబెట్టినోళ్లు కొందరైతే.. చైనాలో ఇంతే.. చైనాలో ఇంతే అనిసరిపుచ్చుకున్నవాళ్లు మరికొందరు.
మరి.. మనమేం చేద్దాం..నిజంగా ఏం జరిగిందో తెలుసుకుందాం..
రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న 70 ఏళ్ల మహిళ ఒక్కసారిగా రోబో తన వెనుక నిల్చుని ఉండటాన్ని చూసి హడలిపోయారు. నా గుండె ఆగినంత పనైంది అంటూ తిట్టేశారు. ఆ వృద్ధురాలు రోబోను తిడుతున్నట్లు.. చేతులు పలుమార్లు గాల్లోకి లేపి రోబో ఏదో అంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్‌గా మారింది. రోబో తనను ఫాలో చేసిందని.. భయపెట్టిందని ఆ మహిళ పోలీసులకు చెప్పడంతో యూనీట్రీ జీ–1 రోబోను పోలీసులు అరెస్టు చేసే నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
భయపడటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆస్పత్రికి పంపారు. అయితే, వైద్యులు బాగానే ఉందని అనడంతో ఆ రోబో ఆపరేటర్ మీద తాను ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయడం లేదని ఆమె పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు రోబోను ఆపరేటర్‌కు అప్పగించి.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ రోబో దగ్గర్లోని విద్యాసంస్థదట. ఆ సంస్థ ప్రమోషన్ కార్యక్రమాలకు దాన్ని వాడుతున్నారు.
ఆ రోజున తన దారిలో తాను రోబో వెళ్తుండగా.. ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు రోబో ఆపరేటర్ చెప్పారు. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేయకున్నా.. ఇలా రోబోను అదుపులోకి తీసుకోవడం కూడా ఇదే తొలిసారని చెబుతున్నారు. మరోవైపు ఇంటర్నెట్లో నెటిజనులు ఎప్పట్లాగా రెండుగా విడిపోయారు. కొందరిటు.. కొందరటు చేరారు.
ఇంతకీ మీరెటు? తప్పు రోబోదా? ఆ వృద్ధురాలిదా?


