ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అనుచరులతో మాకు ప్రాణహాని | Udayagiri TDP MLA followers threaten our lives | Sakshi
Sakshi News home page

ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అనుచరులతో మాకు ప్రాణహాని

Jun 14 2026 5:33 AM | Updated on Jun 14 2026 5:33 AM

Udayagiri TDP MLA followers threaten our lives

ఇంటిని, 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు

ఫిర్యాదు చేస్తే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు 

పోలీసుల ఎదుటే దాడులకు పాల్పడ్డారు 

అరాచక శక్తులకు ఎమ్మెల్యే కాకర్ల అండ 

మీడియా ఎదుట బాధిత మహిళల గోడు

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ అనుచరులతో తమకు ప్రాణహాని ఉందని నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన వెనిగంట్ల వరమ్మ, ఆమె కుమార్తె  రజిత మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను రజిత వెల్లడించారు.  ‘నా తల్లి వరమ్మ పేరు మీద కమ్మపాలెంలో ఐదెకరాల భూమి ఉంది. ఇందులో నా అన్న రమేష్ కు 3 ఎకరాలు,  పసుపు కుంకుమ కింద నాకు 2 ఎకరాలు వచ్చాయి. పెళ్లి తర్వాత నేను విజయవాడలో నివాసం ఉంటున్నాను. 

నాకు మా అమ్మ ఇచ్చిన భూమికి  పక్కనే  మరో రెండెకరాల భూమిని కొనుగోలు చేశా. కమ్మపాలెంకు దగ్గరగా జాతీయ రహదారి రావడంతో భూముల విలువ అమాంతం పెరిగింది.  దీంతో కమ్మపాలెంలో ఉన్న మా  అమ్మ ఇంటిపైనా, అలాగే నా భూమిపైనా ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ అనుచరులు దివి శ్రీను, ఘంటా అశోక్, ఘంటా సుబ్బనాయుడు కన్నుపడింది.  అప్పటి నుంచి వారు నా నాలుగు ఎకరాల  భూమిలోకి వెళ్లనీయకుండా బెదిరిస్తున్నారు. పైగా భూమిని వారి కబ్జాలోకి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా తల్లిని ఇంట్లోకి రానీయకుండా సైతం ఇబ్బందులకు గురి చేశారు. 

ఇంటిని కబ్జా చేయడంతో భయపడి విజయవాడలో నా వద్దనే ఉంటోంది.  మాకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు చెప్పుకునేందుకు వెళితే ఎమ్మెల్యే తన అధికారాన్ని ప్రయోగిస్తున్నారు. జేసీ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయగా వారు జలదంకి పోలీసుల వద్దకు పంపించారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే.. అప్పుడే  అక్కడకు దివి శ్రీను, ఘంటా అశోక్‌; సుబ్బనాయుడు వచ్చారు. మాపై పోలీసుల ఎదుటే దౌర్జన్యం చేశారు. నా తల్లిని తలపై కొట్టారు.  పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని మా భూమిని, ఇంటిని మాకు దక్కేలా చూడాలి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.  నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యే అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement