2 Years YSJagan Ane Nenu: ప్రజల నాడి పట్టిన ప్రభుత్వం

Two Years Of YS Jagan Rule In AP: Medical And Health Sector - Sakshi

వైద్య సేవల్లో రాజీ పడని ముఖ్యమంత్రి

ఆరోగ్య శ్రీ పరిధిలోకి 95 శాతం ప్రజలు 

ఆరోగ్య శ్రీలో కరోనా, ఫంగస్ వ్యాధులకు చికిత్స

దశల వారీగా ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ

9,712  మంది  వైద్య సిబ్బంది  నియామకం

1,088 నూతన అంబులెన్స్‌లు ప్రారంభం 

అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్​ జగన్‌మోహన్‌రెడ్డి. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టి టెలిమెడిసన్‌ వరకు వైద్య సేవలను విస్త్రృతం చేశారు. గత రెండేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు.

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
వైద్యానికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సాయం పొందే వెసులుబాటు ఏపీ ప్రజలకు సీఎం జగన్​ అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో   వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా క్యాన్సర్‌తో సహా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​ వెలుపల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలలోని 130కి పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలోని దాదాపు 95 శాతం కుటుంబాలు డాక్టర్‌ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చాయి.

అంతేకాదు ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునే వరకు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని జననేత వైఎస్​ జగన్​ ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000ల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.  డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులూ రోగులకు ఆర్థిక భరసా కల్పిస్తున్నారు. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు రెండు చెవులకూ కాక్లియర్ పరికరం అమర్చడం వంటి అరుదైన సేవలందిస్తోంది.


కార్పొరేటుకి ధీటుగా 
ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనే లక్క్ష్యంతో నాడు-నేడు పథకం కింద ఆసుపత్రుల ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్లు, 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆసుపత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనంత మంది సిబ్బంది ఉండాలనే లక్ష్యంతో గడిచిన రెండేళ్లలో  9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందిని నియమించారు ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​. 

కొత్త మెడికల్​ కాలేజీలు
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ వంతున  కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు వీటికి తోడుగా కొత్తగా మూడు క్యాన్సర్, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు గిరిజన ప్రాంత ప్రజల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏల పరిధిలో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టారు.  దశలవారీగా మూడేళ్లలో అన్ని పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 


1,088 కొత్త అంబులెన్సులు
ఆపత్కాలంలో రోగులకు అత్యసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం రూ.210 కోట్లతో 1,088 అంబులెన్సులు కొనుగోలు చేసింది. వీటిని 104, 108 సర్వీసులలో ఉపయోగిస్తున్నారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్​ చేరుకునే వీలు చిక్కింది. మరోవైపు 104 సేవల్లో భాగంగా వైద్య సిబ్బంది పల్లెలకు వెళ్లి  బీపీ, షుగర్, ఈసీజీ ఇలా 20 రకాల వైద్య సేవలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. 104, 108 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నేటి పరిస్థితులకు తగ్గ గౌరవ వేతనం అందిస్తున్నారు. 

కంటి వెలుగు
వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా కంటి వైద్య సేవలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి కంటి అద్దాలు అందిస్తున్నారు. మరోవైపు అవ్వా తాతలకు గ్రామ సచివాలయాల్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేపడుతున్నారు. శస్త్ర చికిత్సలు జరిగిన వారికి ఇంటివద్దకే వచ్చి ఉచిత కంటి అద్దాలు అందచేసేలా ఈ పథకానికి  సీఎం జగన్​ రూప కల్పన చేశారు. 

టెలిమెడిసిన్‌
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,410 కాల్ సెంటర్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు అందిస్తోంది. ప్రతీ జిల్లాకు ఒక టెలిమెడిసిన్ సేవా కేంద్రంతో పాటు ప్రతీ కేంద్రంలో 10 నుంచి 15 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. వీరు  రోగి నుంచి జబ్బు వివరాలు తెలుసుకొని మందులు, సూచనలను ఫోన్ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలో టెలీమెడిసిన్ కేంద్రాల ద్వారా ప్రతి రోజు వేలాదిమంది రోగులకు ఆరోగ్య సేవలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top