
తిరుపతి, సాక్షి: శ్రీవారి గోశాలలో గోమాతల మరణాల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)పై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. గోమాతల మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చకు రావాలంటూ టీడీపీ నేతలే ఆయనకు సవాల్ విసిరారు. అదే టైంలో.. పోలీసుల సాయంతో భూమనను నిర్భందించి ఇబ్బంది పెట్టడంతో నిన్నంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజాగా.. గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్(TTD Ex Chairman) భూమన కరుణాకరరెడ్డి పై కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. గోశాలపై అతస్య ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టించారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో భూమనపై కేసు నమోదు అయ్యింది. గురువారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు ఆగమేఘాల మీద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు ఈ కేసులో నమోదు అయినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. శ్రీవారి ఎస్వీ గోశాలలో గోమాతల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే గోమాతలు చనిపోతున్నాయి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ గోశాల అధికారులే స్పష్టం చేయడం తెలిసిందే. అయినా కూడా గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి వాదిస్తుండడం కొసమెరుపు.

