విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు | Trains Stalled For Two Hours At Duvvada Railway Station, Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు

Jun 5 2026 10:16 AM | Updated on Jun 5 2026 10:31 AM

Trains Stalled For Two Hours At Duvvada Railway Station, Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: దువ్వాడ  రైల్వే స్టేషన్‌ సుమారు రెండు గంటల పాటు  రైళ్లు నిలిచిపోయాయి. దువ్వాడలోని రెండో లైన్‌లో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో  నాలుగో నెంబర్ ప్లాటుఫారంపై కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. మరో ఐదు ట్రైన్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6.15 నుంచి 8.15 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాంకేతికపరమైన ఇబ్బందులను తొలగించిన రైల్వే అధికారులు.. రైళ్లు రాకపోకలను పునరుద్ధరించారు.

విశాఖ–ఇచ్ఛాపురం సెక్షన్‌లో జీఎం తనిఖీలు
సౌత్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాధుర్‌ గురువారం విశాఖ– ఇచ్ఛాపురం సెక్షన్‌లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. అమృత్‌ భారత్‌ పథకం కింద ఎంపికైన సింహాచలం రైల్వే స్టేషన్‌తో పాటు కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆయన.. నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఇచ్ఛాపురం– విశాఖ మధ్య విండో ట్రైలింగ్‌ ఇన్‌స్పెక్షన్‌ ద్వారా రైల్వే ట్రాక్స్, సిగ్నలింగ్‌ వ్యవస్థ, బ్రిడ్జిలను పరిశీలించి, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ బి.ఎస్‌.కె. రాజ్‌కుమార్, పీసీఎస్‌టీఈ ఓబీ సురేష్‌కుమార్, పీసీవోఎం వినీత్‌కుమార్, సీఏవో అంకుష్‌ గుప్తా, డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రా తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement