Bheemuni Kolanu: ద్రౌపది దాహం తీర్చుకున్న కొలను.. ఎక్కడో తెలుసా?

Tourist Place Srisailam Bheemuni Kolanu History - Sakshi

శ్రీశైలం(నంద్యాల జిల్లా): దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ప్రాంతమే భీముని కొలను. సెలయేర్ల సవ్వడులతో, పక్షుల కిలకిలరావాలతో రెండు కొండలు చీలినట్లు ఉండి ఆ మధ్యలో గంభీరంగా రాతిపొరల నడుమ భీమునికొలను కనువిందు చేస్తోంది. ఎంతో ఆహ్లాదకరంగా సాగే భీమునికొలను సందర్శనం మంచి అనుభూతిని ఇస్తుంది.
చదవండి: ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ?

స్థల పురాణం ఇదీ..
పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట. ఆ పరిసరాలు చూసివచ్చిన భీముడు .. ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. దాంతో లోమశ మహర్షి ఒక శిలను చూపించి దానిని పగులగొట్టమని చెప్పాడు. తన గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగానే నీటి ధారలు కిందికి దూకాయని, ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుందని, భీముడి కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి ’భీముని కొలను’ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.

ఆహ్లాదకర ప్రదేశం 
పూర్వపు రోజుల్లో కాలినడకన వచ్చే భక్తులు ఈ భీమునికొలను మీదుగానే శ్రీశైలాన్ని చేరేవారు.  శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో ఈ భీమునికొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. భీముని కొలను లోయప్రాంతం ప్రకృతి అందాలతో అలరారుతూ చూపరుల మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కైలాసద్వారం నుంచి దాదాపు 2వేల అడుగుల లోతులో ఉండే ఈ భీమునికొలను లోయ చుట్టూ సుమారు 650 అడుగుల పైగా ఎత్తులో దట్టమైన కొండలు వ్యాపించి ఉన్నాయి. లోయకు ఇరువైపులా రంపంతో కోసినట్లుగా ఏర్పడి నునుపైన శిలలు ముచ్చటగా ఉంటాయి. లోయ పైతట్టు ప్రాంతంలోని కొండ ల్లోంచి ఉబికి వచ్చే సహజ జలధారలు లోయలో బండరాళ్లపై ప్రవహిస్తూ, పెద్దకోనేరులాగా కని్పంచే భీమునికొలను చేరి పొంగిపొర్లుతుంటాయి. ఈ నీరు మండు వేసవిలో కూడా నిరంతరం ప్రవహిస్తుండడం విశేషం.  

ఇలా చేరుకోవచ్చు..:
భీముని కొలను వెళ్లేందుకు శ్రీశైలం నుంచి సుమారు 4 కి.మీ దూరంలో ఉన్న హఠకేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపున అడవి దారిలో 2 కి.మీ. ప్రయాణించి కైలాసద్వారం వెళ్లాలి. హఠకేశ్వరం నుంచి కైలాస ద్వారం వరకు మట్టిరోడ్డు ఉంది. కారు, జీపు, చిన్న వాహనాల్లో  ఇక్కడికి సులభంగా వెళ్లవచ్చు. కైలాసద్వారం నుంచి సుమారు 850 మెట్లు దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీమునికొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top