Special Train: విజయవాడ టు గుజరాత్‌.. 

Tourism Special train launch soon for Vijayawada to Gujarat - Sakshi

త్వరలో టూరిజం స్పెషల్‌ రైలు ప్రారంభం  

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అనేక ప్యాకేజీలను యాత్రికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ‘వైబ్రెంట్‌ గుజరాత్‌’ పేరుతో విజయవాడ నుంచి ప్రత్యేక టూరిజం రైలు నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కిషోర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రికుల ప్రత్యేక రైలు 2022 జనవరి 21వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరి 31వ తేదీ సాయంత్రం తిరిగి విజయవాడ చేరుతుంది. ఈ రైలుకు ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖపట్నం స్టేషన్లలో బోర్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో సోమనాథ్‌ జ్యోతిర్లింగ దర్శనం, ద్వారకాదీష్‌ టెంపుల్‌తో పాటు సమీపంలోని ప్రముఖ దేవాలయాల దర్శనం, నాగేశ్వర్‌ జ్యోతిర్లింగ దర్శనం, శబరిమతి ఆశ్రమం, అక్షరథామ్‌ టెంపుల్, స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ తదితర చారిత్రక ప్రాంతాలను చూపిస్తారు.

యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ రైలులో ప్రత్యేక ఐసోలేషన్‌ కోచ్‌తో పాటు ప్యాంట్రీకారు, సెక్యూరిటీ, గైడ్‌లు అందుబాటులో ఉంటారు. అసక్తి గల వారు విజయవాడ స్టేషన్‌లోని ఐఆర్‌సీఈసీ కార్యాలయంలో నేరుగా, లేదా 82879 32312, 97013 60675 సెల్‌ నంబర్లలో,  https://www. irctctourism. com/ వెబ్‌సైట్‌ సంప్రదించి టికెట్లు బుక్‌ చేసుకోవాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top