Tirumala Plastic Ban: తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం.. టీటీడీ సూచనలు తప్పక తెలుసుకోండి

Total Plastic Ban At Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి(బుధవారం, జూన్‌ 1వతేదీ) నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా తిరుమల ఆస్థానమండపంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అధికారులు సమావేశం నిర్వహించారు.

ఈ క్రమంలో హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా డస్ట్ బిన్లలో ఉంచాలని, తద్వారా సేకరణకు అనువుగా ఉంటుందని అధికారులు అదేశాలు జారీ చేశారు. దుకాణాల్లో అనుమతించిన వస్తువులనే విక్రయించాలని , దుకాణదారులు ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాస్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులు కోరారు. జూన్ ఒకటో తేదీ నుంచి విజిలెన్స్, హెల్త్, ఎస్టేట్ అధికారులు నిరంతరంగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కనిపించినా దుకాణాలను సీజ్ చేస్తారని స్పష్టం చేశారు. దుకాణదారులు ఒక సంకల్పంతో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు.

కాగా, ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దుకాణ దారులకు సూచించారు. పంచలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు గానీ, పేపర్ కవర్లు గాని ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ షాంపూ పొట్లాలు కూడా విక్రయించరాదని టీటీడీ సూచించింది. హోటళ్ల నిర్వాహకులు, మఠాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి టీటీడీ పేర్కొంది. దుకాణాల వద్ద అధిక ధరలకు విక్రయించకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.

మరోవైపు.. తిరుమల తరహాలోనే ఏపీలో ఉన్న దేవాలయాల్లో ఇక నుంచి ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్‌ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి ఇకపై అనుమతించబోమని అంటున్నారు. ఆలయానికి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్నగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి.. ప్రధాన ఆలయాలు అన్నింటిలో ప్లాస్టిక్‌ నిషేధించనున్నట్టు అధికారులు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top