
టమాట ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. ఏకంగా రూ.9 లకే..
సాక్షి, అన్నమయ్య: కొండెక్కి రేట్లతో సామాన్యుడ్ని నెలలపాటు ముప్పుతిప్పలు పెట్టిన టమాటా ధర.. అమాంతం పడిపోయింది. ఒకానొక టైంలో కేజీ 300 దాకా చేరుకుని చుక్కలు చూపించింది. అయితే ఊహించినట్లుగా.. ధరలు పడిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి.
నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ. 50 లోపుకి చేరుకుంది. చాలా చోట్ల కేజీకి రూ. 15, రూ. 20 ఇలా దొరుకుతోంది కూడా. హైదరాబాద్‌లోనూ కేజీ రూ. 20 దాకా పలుకుతోంది. అయితే.. టమాట మార్కెట్ యార్డ్ మదనపల్లెలో(అన్నమయ్య జిల్లా ఏపీ) కేజీ టమాట రూ.9కి పలుకుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు.
సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఆ మధ్య అన్ని ప్రధాన నగరాల్లో టమాటాలు సెంచరీని దాటేసిన సంగతి తెలిసిందే.