తిరుపతి గంగమ్మ జాతర మొదలైందహో.. | Sakshi
Sakshi News home page

తిరుపతి గంగమ్మ జాతర మొదలైందహో..

Published Wed, May 10 2023 5:02 AM

Tirupati Ganga Jatara from today till 16th - Sakshi

తిరుపతి కల్చరల్‌: ‘‘ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా.. తిరుపతి గంగజాతర చాటింపుతో నేటి నుంచి ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. కనుక నగరవాసులెవరూ ఊరు వదలి వెళ్లరాదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయకుండా వెళ్లిపోవాలి. జాతర ప్రారంభమైనందున అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించుకోవాలహో.’’ అంటూ సంప్రదాయం ప్రకారం కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర మంగళవారం అర్ధరాత్రి తర్వాత చాటింపు వేశారు.

భేరివీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించిన అనంతరం నాటి నగర శివారు ప్రాంతాలైన నాలుగు కాళ్ల మండపం, హెడ్‌పోస్టాఫీస్, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నిటీ ఆసుపత్రి సర్కిల్‌ ప్రాంతాల్లో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆ చాటింపుతో తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్నగంగమ్మ (తిరుపతి గ్రామదేవత) జాతర అత్యంత వేడుకగా ఆరంభమైంది. భక్తకోటి కోర్కెలు తీర్చే కల్పవల్లి, తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనుంది.  

కొడిస్తంభానికి అభిషేకం, ఒడిబాలు సమర్పణ 
జాతర ప్రారంభ సన్నాహకాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు ఆలయ ఆవరణలోనున్న అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి అర్చకులు అభిషేకం చేసిన అనంతరం కొడిస్తంభానికి ఒడిబాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయరెడ్డి హాజరయ్యారు.

అమ్మవారిని దర్శించుకొని ఒడిబాలును నెత్తినపెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణతో కొడిస్తంభం వద్దకు చేరుకొని పూజలు చేసి ఆ ఒడిబాలు సమర్పిం చారు. ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి పొంగళ్లు నైవేద్యాన్ని సమర్పిం చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ కట్టా గోపియాదవ్, ఈవో ఎం.మునిక్రిష్ణయ్య, పాలక మండలి సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలకగిరి ప్రతాప్‌రెడ్డి, ఆలయ అర్చకుడు రామకృష్ణ శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు బైరాగి వేషం 
గంగజాతర ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు బుధవారం బైరాగి వేషంతో జాతర ఆరంభమవుతుంది. బైరాగి వేషాలు వేసిన వారు గుంపులు గుంపులుగా బయలుదేరి మొదట వేషాలమ్మను, తర్వాత శ్రీతాళ్లపాక పెద్దగంగమ్మను దర్శించుకొని తర్వాత శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు. కేరింతలు కొడుతూ ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల వద్ద ప్రణమిల్లి మొక్కులు తీర్చుకుంటారు.

శ్రీవారి ఆవిర్భావంతోనే గంగావతరణ: గణపతి సచ్చిదానందస్వామి
సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఏడుకొండలపై శ్రీవేంకటేశ్వరునిగా ఆవిర్భవించడంతోనే తిరుపతిలో గంగమ్మ వెలసిందని గురుదత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి తెలిపారు. మంగళవారం ఆయన శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగమ్మ ఆలయానికి చరిత్రతో పనిలేదని, అమ్మవారి మహిమలే చరిత్రకు ఆధారమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలుగా యావత్‌ భక్తకోటికి కల్పవల్లిగా విరాజిల్లుతోన్న మహిమాన్విత శక్తి స్వరూపిణి అని తెలిపారు. అమ్మవారి ఆలయం అద్భుత రాతి శిల్పాలతో నేడు నూతన ఆలయంగా పునఃప్రారంభించడం ఆ శ్రీవారు, అమ్మవారి కృపాకటాక్షాలేనన్నారు.

ఈ అమ్మవారి విశిష్టత గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో తాము సైతం భాగస్వాములమవుతామన్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ విశిష్టత, వైభవాన్ని దశదిశలా చాటేందుకు వారం రోజుల పాటు ఈ గంగమ్మ ఆలయంలో ప్రవచనం అందిస్తానని తెలిపారు.

Advertisement
Advertisement