మారిన మందు.. బాలుడికి అస్వస్థత 

Tirupati DCHS Vedasai inquiry into boy illness - Sakshi

అవుట్‌ సోర్సింగ్‌ సెక్యూరిటీ గార్డ్‌ తొలగింపు 

ముందస్తు పరీక్షల నిమిత్తం రుయాకు తరలింపు  

పుత్తూరు రూరల్‌: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన డాక్టర్లకు చెమటలు పట్టించింది. స్థానిక గేటు పుత్తూరులోని శెంగుంధర్‌ వీధికి చెందిన రాజ్‌కుమార్‌.. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదేళ్ల తన కుమారుడు రోహిత్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లకు చూపించాడు. పరీక్షించిన డాక్టర్‌ సిరప్‌ రాసిచ్చాడు. తర్వాత చీటీ చూపించి మందు తీసుకెళ్లి 5 ఎంఎల్‌  తాగించాడు. కొద్ది సేపటికి రోహిత్‌ కడుపులో మంటగా ఉందని చెప్పడంతో, సిరప్‌ను పరిశీలించి అది ల్యాన్‌డన్‌ లోషన్‌గా గుర్తించాడు. వెంటనే రోహిత్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు.

డాక్టర్‌ శంకర్‌నారాయణ పరీక్షించి కడుపులోని మందును వామ్టింగ్‌ చేయించడంతో పాటు తగిన చికిత్స అందించడంతో నిమిషాల్లోనే కోలుకొన్నాడు. మందు మారడానికి కారణాన్ని అన్వేషించగా.. ఫార్మసిస్ట్‌ సెలవులో ఉండటంతో సెక్యూరిటీ గార్డ్‌ (అవుట్‌ సోర్సింగ్‌)గా పనిచేస్తున్న వసంత్‌ మందును మార్చి ఇచ్చాడని గుర్తించారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జరినా సెక్యూరిటీ గార్డ్‌ వసంత్‌ను తొలగించారు. రోహిత్‌ను మెరుగైన పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మందు మార్చి ఇచ్చిన వసంత్‌ అనే వ్యక్తి తప్పిదం వల్ల మా బాబు ఇబ్బంది పడ్డాడు గానీ ఇందులో డాక్టర్ల తప్పిదమేమీ లేదని బాలుడి తండ్రి రాజ్‌కుమార్‌ చెప్పారు.  

విచారణ జరిపిన ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌
పుత్తూరు రూరల్ః పుత్తూరు ప్రభుత్వ మందు మార్పు–బాలుడి అస్వస్థతపై తిరుపతి డీసీహెచ్‌ఎస్‌ వేదసాయి విచారణ చేశారు. ఆదివారం రాత్రి ఆమె పుత్తూరు ఆసుపత్రికి వచ్చి జరిగిన సంఘటపై పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న రోహిత్‌ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సిరప్‌ను ఇచ్చిన అవుట్‌ సోర్సింగ్‌ సెక్యూరిటీ గార్డ్‌ వసంత్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. జరిగిన మొత్తం సంఘటనపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జరినాకు మెమో ఇచ్చినట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top