
గతంలో భూములిచ్చిన వారి పరిస్థితి చూస్తే భయమేస్తోంది
రైల్వే లైన్, అంతర్గత రోడ్లకు సానుకూలమే కానీ.. పూలింగ్‌కు ఒప్పుకునేది లేదు
రాజధాని భూ సమీకరణ గ్రామసభల్లో రైతుల వెల్లడి
తాడికొండ: భూసమీకరణకు భూములిచ్చే ప్రసక్తే లేదని రాజధాని గ్రామాల్లోని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో మంగళ, బుధవారాల్లో జరిగిన గ్రామ సభల్లో రైతులతో పాటు టీడీపీ నాయకులు సైతం భూముల సమీకరణకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. గతంలో భూములిచ్చిన వారి పరిస్థితి చూస్తే తమకు భయమేస్తోందని, పూలింగ్ కోసమని తీసుకుని పదేళ్లుగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. హరిశ్చంద్రపురానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఈ విధానాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు.
‘ఇంతకుముందు నమ్మి భూములిచ్చిన రైతులకు రూ.63 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు కదా. చేసి చూపించండి అప్పుడు చూద్దాం. తలాతోక లేకుండా సమీకరణ పేరుతో మా భూములను తీసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు’ అని తేల్చిచెప్పారు. మరికొందరు రైతులు మాట్లాడుతూ రైల్వే లైన్, అంతర్గత రోడ్లకు అయితే కొంత సానుకూలంగా ఉంటాం కానీ.. పూలింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. అసలు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మకం ఏమిటని, కేంద్రం రాజధానిపై స్పష్టమైన గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏంటని ప్రశి్నంచారు.
ఎమ్మెల్యేకు షాకిచ్చిన రైతులు
వడ్డమాను గ్రామ సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని రైతులకు చెబుతుండగా.. రైతులు ఆయనకు షాకిచ్చారు. ‘మీరు 10 సంవత్సరాల క్రితం గెలిచారు. మళ్లీ ఇప్పుడు గెలిచారు. వడ్డమానులో పుష్కరాలకు ఒకసారి రోడ్డు వేస్తారు. మనిషి దిగిపోయేంతగా గుంతలు పడి వెళ్లేందుకు కూడా ఇప్పుడు మార్గం లేదు. 2029 వరకు అవకాశం ఉంది. తొలివిడతలో రైతులు ఇచ్చి న భూములను అభివృద్ధి చేసి చూపించండి. ఇప్పటికే ఏడాది పూర్తయింది.
చివరి ఏడాది తీసేస్తే మూడేళ్లు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈలోగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఇతర ప్రభుత్వ భవనాలు కట్టండి. రైతుల భూముల అభివృద్ధి చేయండి. ఇప్పుడైతే భూసమీకరణకు మేం వ్యతిరేకం. మొదట భూములిచ్చిన రైతులకు సంతృప్తి కలిగించి.. మా వద్దకు వస్తే అప్పుడు ఆలోచిస్తాం’అని రైతులు తెగేసి చెప్పారు. గ్రామ సభల్లో ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.సుజాత, ఎంపీడీవో కానూరి శిల్ప పాల్గొన్నారు.