ఎస్‌వీ వర్సిటీలో నుంచి రహదారులు వద్దు | There are no roads from SV University | Sakshi
Sakshi News home page

ఎస్‌వీ వర్సిటీలో నుంచి రహదారులు వద్దు

Feb 29 2024 4:47 AM | Updated on Feb 29 2024 9:44 AM

There are no roads from SV University - Sakshi

హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: తిరుమల వెళ్లే భక్తు­ల సౌకర్యార్థం తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో నుంచి రహదారులు నిర్మాణం చేపట్టేందుకు తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. వర్సిటీలో నుంచి రోడ్లు ఏర్పాటుకు అభ్యంతరం లేదని వీసీ చెప్పడాన్ని తప్పుబట్టింది.

వర్సిటీలో నుంచి రహదారి నిర్మాణాలను చేపట్టవద్దని ఆదేశిస్తూ ఇలాంటి విషయానికి అంగీకారం తెలిపే ముందు విద్యార్థుల ప్రయోజనాల గురించి ఆలోచించాలని వీసీకి హితవు పలికింది. తిరుమల వెళ్లే వారి కోసం వర్సిటీలో నుంచి రోడ్డు వేయడం సరికాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. 

చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి 
శ్రీకాకుళం జిల్లా సింగూపురం పంచాయతీ పరిధిలోని చెరువును స్థానిక సర్పంచ్‌ కబ్జా చేసి పూడ్చేస్తున్నారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకుని, దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సింగుపురంలోని చెరువును సర్పంచ్‌ ఆదిత్య నాయుడు కబ్జా చేసి పూడ్చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగుపురం ఎంపీటీసీ బగ్గు అప్పారావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

నెల రోజుల్లో రూ.8వేల కోట్లను జమ చేస్తా 
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించబోమని కేంద్రం ప్రకటిస్తే పలువురు బిలీనియర్లతో పాటు తన వంతు కింద నెల రోజుల్లో రూ.8 వేల కోట్లను జమ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైకోర్టుకు నివేదించారు. విదేశాల నుంచి నిధులు స్వీకరించేందుకు వీలుగా ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేటరీ యాక్ట్‌ కింద ప్రత్యేక ఖాతాను కేంద్రం అనుమతిస్తే, ఆ నిధులను అందులో జమ చేస్తానన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములను విక్రయించకుండా స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్, న్యాపతి విజయ్‌ల ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన దాఖలైన పిల్‌లను పాల్‌ వ్యాజ్యంతో జత చేసే విషయంలో సీజే నుంచి పాలనాపరమైన ఆదేశాలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 

యంత్ర సామగ్రిని జప్తు చేయండి 
విశాఖ జిల్లా భీమునిపట్నం సముద్ర తీరం సమీపంలో చేపడుతోన్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) పరిధిలో చేపడుతోన్న ఈ నిర్మాణాలకు ఎలా అనుమతులిస్తారని అధికారులను ప్రశ్నించింది.

అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అవి అక్రమ నిర్మాణాలవుతాయని, నిర్మాణ ప్రదేశంలో ఉన్న యంత్ర సామాగ్రిని తక్షణమే జప్తు చేయాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నివేదికివ్వాలని ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement