విషాదం.. అమెరికాలో పోలీస్‌ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి..

Telugu Student From Adoni Died In Road Accident Seattle USA - Sakshi

ఆదోని అర్బన్‌ (కర్నూలు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన వివరాలను విద్యార్థిని తాత సూర్యబాబు, మామ శ్రీనివాసులు బుధవారం తెలియజేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కుంబళ్లూరు క్యాంప్‌నకు చెందిన శ్రీకాంత్‌, విజయలక్షి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రీకాంత్‌ కానిస్టేబుల్‌ కాగా, విజయలక్షి​ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. 

పిల్లల చదువు కోసం శ్రీకాంత్‌ దంపతులు ఆదోని వచ్చి స్థిర పడ్డారు. పెద్ద కుమార్తె జాహ్నవి (23) ఆదోనిలో డిగ్రీ వరకు చదివింది. ఆమె 2021లో అమెరికాలోని సీయాటిల్‌ నగరంలో ఉన్న నార్త్‌ ఈ‍స్ట్రన్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ కోర్సులో చేరింది. మరో నాలుగు నెలల్లో జాహ్నవి ఎంఎస్‌ కోర్సు పూర్తికానుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం రాత్రి సియాటిల్‌లో కాలేజీ నుంచి రూమ్‌కు వస్తూ రోడ్డును దాటుతుండగా సీయాటిల్‌ పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొంది. 

వాహనం కింద చిక్కుకున్న జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన తల్లి విజయలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలింది. నాలుగు నెలల్లో ఎంఎస్‌ పూర్తి చేసుకుని అమెరికాలోనే మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడతుందని ఆశించిన కుమార్తె అకాలమరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. జాహ్నవి మృతదేహాన్ని మరో మూడు రోజుల్లో స్వదేశానికి తీసుకువస్తారని తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top