అప్పుడే వద్దు.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలివే..

Teenage Pregnancy Is Increasing In Anantapur District - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  తెలిసీ తెలియని వయసులో కలిగే లైంగిక కోరికలతో పాటు లైంగిక హింస, బాల్య వివాహాలు.. ఆడుకునే అమ్మాయిల్ని అమ్మల్ని చేస్తున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చిన అమ్మాయిల్లో, వారికి పుట్టే పిల్లల్లో కొన్ని దీర్ఘ కాలిక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఇద్దరూ జీవితాంతం ఇటు  శారీరకంగా, అటు మానసికంగా బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక విద్య పట్ల పూర్తి  అవగాహన కల్పిస్తేనే ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో మార్పు రాకపోవడం విస్మయపరుస్తోంది. కూతురు రజస్వల కాగానే పెళ్లి చేస్తే సరిపోతుందని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కాగా కొంతమంది అమ్మాయిలు చదువు, కెరీర్, ఉద్యోగాల్లో స్థిరపడటం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం గురించి ఆలోచిస్తూ 26 ఏళ్ల వరకూ వివాహం చేసుకోవడం లేదు..

కానీ గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూతురికి పెళ్లిచేస్తే తమ బాధ్యత తీరుతుందని, బరువు తగ్గుతుందని పదహారేళ్లకే కానిచ్చేస్తున్నారు. ఈ కారణంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ఇక్కడే కాదు రాయలసీమ జిల్లాల్లోనే చిన్న వయసులో తల్లులవుతున్న వారు చాలా ఎక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యంగా కలుగక మానదు.

పదహారేళ్లకే తల్లులుగా.. 
వివాహ అర్హత వయసే 18 ఏళ్లు ఉండగా పదహారేళ్లకే తల్లులవుతున్న పరిస్థితి చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గడిచిన 11 మాసాల్లో అనంతపురం జిల్లాలో 105 మంది అమ్మాయిలు 16 ఏళ్ల లోపు వయసులోనే గర్భం దాల్చారు. 18 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిల్లో మరో 433 మంది గర్భం దాలి్చన వారిలో ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనూ 16 ఏళ్లలోపు వయసున్న 63 మంది అమ్మాయిలు తల్లులయ్యారు.

18 ఏళ్లలోపు ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వారు మరో 283 మంది ఉన్నారు. వీరిలో 95 శాతం మంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలే. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు వారికి మూడుముళ్ల బంధం వేసి వారి కెరీర్‌కు మధ్యలోనే సమాధి కడుతున్నారు. రాయలసీమ జిల్లాలో కర్నూలు తర్వాత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై అబ్బాయిలతో కలిసి      ఇంట్లోనుంచి వెళ్లిపోతున్న పరిస్థితులూ ఉన్నాయి.

టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలు
మెటర్నల్‌ మోర్టాలిటీ అంటే కాన్పు సమయంలో తల్లులు మృతి చెందే అవకాశం ఉంది
నెలలు నిండక ముందే పుట్టే అవకాశం 
స్టిల్‌ బర్త్‌ అంటే కడుపులోనే బిడ్డ     చనిపోవడం 
శిశువులు బరువు  తక్కువగా పుట్టడం 
తీవ్రస్థాయిలో రక్తపోటు 
శిశువులు సరిగా శ్వాస తీసుకోలేక పోవడం
చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు.. 

చర్యలు తీసుకుంటాం 
1098.. ఇది చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌. బాల్య వివాహం చేసినట్లు లేదా ఏర్పాట్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే సదరు ప్రాంతానికి వెళ్తాం. అమ్మాయిని కేజీబీవీలో చేర్పించి చదివిస్తాం. చట్టపరంగా తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటాం. చాలామంది అమ్మాయిలు మొబైల్‌ ఫోన్‌లు, సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై చిన్న వయసులో అబ్బాయిలతో కలిసి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి. 
– శ్రీదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top