భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు..

Earthquake Measuring 4-3 Magnitude Richter Scale Struck Sikkim - Sakshi

న్యూఢిల్లీ: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్‌లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణలు అంచనావేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజరూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. గుజరాత్‌లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు రాగా.. తాజాగా సోమవారం ఉదయం సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రత నమోదైంది.

ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని యుక్‌సోం ప్రాంతంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు  జాతీయ భూ విజ్ఞాన కేంద్రం ట్విట్టర్‌లో తెలిపింది.  ఉదయం 4:15 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు పేర్కొంది.

అస్సాం, గుజరాత్‌లోనూ
ఆదివారం అస్సాంలోనూ భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. అంతుకుముందు రోజు గుజరాత్‌ సూరత్‌లోనూ 3.8 తీవ్రతో భూమి కంపించింది.

దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్‌లో ఉన్నాయని కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ  2022 డిసెంబర్‌లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్‌ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్‌లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది.  

జోన్‌ 5
వెరీ హై రిస్క్‌ జోన్‌ :  రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్‌  
దేశ భూభాగంలో ఇది 11%
ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలు హిమాచల్‌ ప్రదేశ్‌ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్‌ తూర్పు ప్రాంతం, గుజరాత్‌లో రణ్‌ ఆఫ్‌ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్‌ నికోబర్‌ దీవులు  

జోన్‌ 4  
హైరిస్క్‌ జోన్‌ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం  
ఈ జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్‌  
దేశ భూభాగంలో ఇది 18%
ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్‌లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్‌లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్‌  

జోన్‌ 3  
మధ్య తరహా ముప్పు: ఈ జోన్‌లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం
దేశ భూభాగంలో ఇది 31%
ఈ జోన్‌లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్‌ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్‌ 3లోకి వస్తాయి

జోన్‌ 2  
లో రిస్క్‌ జోన్‌ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు  
దేశ భూభాగంలో ఇది 40%  
ఈ జోన్‌లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు.
చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్‌.. మనకు ముప్పు ఎంత?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top