ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి వినతిపత్రం స్వీకరిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
టెట్ మినహాయింపునకు కృషి
పార్లమెంటులో చట్ట సవరణకు పోరాడుదాం
తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు వైఎస్ జగన్ భరోసా
వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని కలవాలని సూచన
రివ్యూ పిటిషన్ కూడా వేసి న్యాయ పోరాటం చేద్దామని స్పషీ్టకరణ
పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతుల స్వీకరణ
తప్పుడు కేసులకు మూల్యం తప్పదు.. బాబు సర్కారుకు హెచ్చరిక
అన్ని సమస్యలపై పోరాటం చేద్దామని ధైర్యం చెప్పిన జననేత
సాక్షి ప్రతినిధి, కడప: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంట్‌లో చట్ట సవరణకు కృషి చేస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసి న్యాయ పోరాటం చేద్దామని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అపాయింట్‌మెంట్ తీసుకుంటారని, వైఎస్సార్‌సీపీ ఎంపీలతోపాటు టీచర్లు ప్రతినిధుల బృందం కూడా వెళ్లి పరిస్థితి వివరించాలని సూచించారు.
ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, టీచర్లకు అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు. మంగళవారం పులివెందుల క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వైఎస్ జగన్‌ను ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ (257), వైఎస్సార్‌టీఏ, అప్టా, ఏపీటీఎఫ్ (1938), పీఈటీ అసోషియేషన్ తదితర సంఘాలతో కూడిన ఫ్యాక్టో (ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) నాయకులు సంగమేశ్వరరెడ్డి, దాదాపీర్, శ్యామసుందరరెడ్డి, సింగారెడ్డి అమరనాథరెడ్డి, సీకే వెంకటనాథరెడ్డి, రెడ్డెప్పరెడ్డి, అబ్దుల్లా, రామాంజనేయులు, శ్రీనివాసులరెడ్డి, శ్యామలాదేవి, నిహారిక, విక్టర్ తదితరులు కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం నియామకమై ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రస్తుతం టెట్ పరీక్ష తప్పనిసరి చేయడం ఉపాధ్యాయులను అభద్రతా భావానికి గురి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టం తీసుకొచి్చ.. డీఎస్సీ పరీక్ష రాసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు సైతం టెట్ పాస్ కావాలని చెప్పిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరే టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడంపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే పాత వారికి కూడా టెట్ తప్పనిసరి చేయడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, చట్ట సవరణ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని చెప్పారు. టెట్ తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కూడా చేయలేదని వైఎస్ జగన్‌కు వివరించారు.
విద్యా హక్కు చట్టంలోని 23వ సెక్షన్‌లో సబ్ సెక్షన్ వన్ సవరించేలా పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరారు. తద్వారా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఒకవైపు బోధన బాధ్యతలు ఉండగా, మరో వైపు టెట్‌కు ప్రిపరేషన్ కష్టసాధ్యంగా మారిందన్నారు.
పైగా బోధించే సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టుల్లో కూడా పరీక్ష రాయాల్సి రావడం సహేతుకం కాదని, ఇందుకు విద్యా హక్కు చట్ట సవరణే సరైన పరిష్కారమని వివరించారు. వారి వినతిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. వైఎస్సార్‌సీపీ ఎంపీలతోపాటు టీచర్లు ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి పరిస్థితి వివరించాలని సూచించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రితో మాట్లాడి అపాయింట్‌మెంట్ తీసుకుంటారని చెప్పారు.
పులివెందులలో ప్రజాదర్బార్
వైఎస్ జగన్ పులివెందుల ప్రజలతో మమేకమయ్యారు. భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి పాలనలో పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని, కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సమస్యల్ని ఓపికతో విన్న జగన్.. పేదలు, విద్యార్థులు, వృద్ధులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందేనని అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
తప్పుడు కేసులకు మూల్యం తప్పదు
టీడీపీ నేతల వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల సమస్యలను విని వారికి మాజీ సీఎం వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు బనాయించే పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు పలువురితో సెల్ఫీలు దిగుతూ అప్యాయంగా మాట్లాడారు.
వైఎస్ జగన్‌ను ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, జెడ్పీ చైర్మెన్ ముత్యాల రామగోవిందురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బి అంజాద్‌భాషా, ఎస్ రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, చిత్తూరు పరిశీలకుడు చవ్వా రాజశేఖరరెడ్డి, కదిరి ఇన్‌ఛార్జి మగ్బూల్‌భాషా, పులివెందుల పరిశీలకుడు పూల శ్రీనివాసులరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కల్లూరు నాగేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు కలిసి మాట్లాడారు.
కాగా.. కడప మున్సిపల్ మైదానంలో మూడేళ్ల క్రితం రూ.27 కోట్లతో నిర్మించిన హాకీ మైదానాన్ని ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులు వైఎస్ జగన్‌ను కలిసి విన్నవించారు.

తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
30 ఏళ్ల సర్వీస్ తర్వాత మళ్లీ పరీక్షలా?
ఇన్ సర్వీస్‌లో ఉంటూ 25–30 ఏళ్లుగా పారదర్శకంగా విద్యాబోధన చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను ఈ వయస్సులో ‘టెట్’ పరీక్ష రాయమనడం అత్యంత దారుణం. నాటి బీఈడీ అర్హతతోనే మేము ఉద్యోగాలు సాధించాం. ఈ అనాలోచిత నిబంధనలతో ఉపాధ్యాయులంతా తీవ్ర మానసిక వేదన, ఆందోళనకు గురవుతున్నారు. – రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ
మెడమీద కత్తి పెట్టి ‘టెట్’ రాయిస్తారా?
20–30 ఏళ్ల అనుభవం ఉన్న టీచర్లకు మినహాయింపు ఇవ్వకుండా ‘టెట్ పరీక్ష రాయకపోతే ఉద్యోగాల నుండి తీసేస్తాం’ అంటూ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినట్లు జీవోలు ఇవ్వడం అన్యాయం. బదిలీలు అయి ఏడాదైనా ఉపాధ్యాయులను రిలీవ్ చేయడం లేదు. రెండేళ్లు దాటినా కొత్త పీఆర్సీ కమిటీ వేయలేదు. ఐఆర్, బకాయిల ఊసే లేదు. – రెడ్డప్ప రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు
వారికి మినహాయింపు ఇవ్వాలి
పార్లమెంట్‌లో 231–ఏ చట్టానికి తక్షణమే సవరణ చేయాలి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు అమలులోకి రాకముందు, అంటే 2010 సంవత్సరానికి ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో చేరిన వారందరికీ టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలి. – శ్యాం సుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కేంద్రంపై ఒత్తిడి తేవాలి
పాఠశాలల్లో కేవలం ఒకే నిర్దిష్ట సబ్జెక్టు బోధించే స్కూల్ అసిస్టెంట్లు.. ఇప్పుడు టెట్ పరీక్ష కోసం చైల్డ్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లిష్ .. ఇలా అన్ని సబ్జెక్టులు చదవాల్సి రావడం పెద్ద శాపంగా మారింది. కేంద్రం చట్ట సవరణ చేసి, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి సంపూర్ణ మినహాయింపు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. – ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పులివెందుల


