
విశాఖ జిల్లా డీఈఓ కార్యాలయం ముందు మోకాళ్లపై నిల్చొని ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల ధర్నా
పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్
తిరుపతి అర్బన్, పార్వతీపురం టౌన్, ఆరిలోవ(విశాఖ): తమకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. శనివారం ఆయా కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల విషయంలో కేడర్ స్ట్రెంగ్త్ వివరాలు, పొజిషన్ ఐడీలు లేకపోవడంతో జూన్, జూలై జీతాలకు ఆటంకం ఏర్పడిందని ఆవేదన చెందారు.
యుద్ధ ప్రాతిపదికన బదిలీలు చేసిన ప్రభుత్వానికి జీతాన్ని చెల్లించడం కష్టమేమీ కాదన్నారు. ఈ నెలాఖరులోగా సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఉపాధ్యాయులు న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని, డీఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయా కలెక్టరేట్లు, డీఈఓ కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించారు. యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.