
అప్పులపాలై..మానసిక వేదనకు గురై బలవన్మరణం
తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది
రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వకపోవడంవల్లే సమస్యలు
టీచర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
ఎంటీఎస్ టీచర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
కోరుకొండ: టీడీపీ కూటమి ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా అందకపోవడంతో తూర్పుగోదావరి జిల్లాలోని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడేనికి చెందిన కన్నాబత్తుల విజయకుమార్ (43) కాపవరం మండల పరిషత్ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్‌గా పనిచేస్తున్నారు. మే నెలలో జీతాలు అందకపోవడంతో అప్పులపాలై, ఆర్థిక సమస్యలతో మానసిక వేదనకు గురై ఆదివారం రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ హుక్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. పిల్లలు ఇంటర్మిడియెట్ చదువుతున్నారు. విజయకుమార్ 2008 డీఎస్సీలో ఎంపికై, నాలుగేళ్లుగా సర్విసులో ఉన్నారు.
ఆ టీచర్లకు సక్రమంగా జీతాలు లేకే సమస్యలు..
1998, 2008 సంవత్సరాల్లో టీచర్లుగా చేరిన వారికి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉద్యోగానికి ఎంపికైనా కూడా వారికి 16 సంవత్సరాలుగా ఉద్యోగాలివ్వలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1998, 2008 సంవత్సరాల్లో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఎంటీఎస్ టీచర్లుగా అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీరికి సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. వారిలో పలువురు వయస్సు రీత్యా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలువురు రిటైర్మెంట్ వయస్సుకు చేరుకుంటూ, కుటుంబ పోషణ కష్టమై, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి..
ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమవుతున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషిచేయడంలేదు. ఎంటీఎస్ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆత్మహత్యలను అరికట్టాలి. – కె.చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కన్వీనర్, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్
రెగ్యులరైజ్ చేయాలి..
ఎంటీఎస్ టీచర్లను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి. వారి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలి. – బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్
కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి..
టీచర్ల ఆత్మహత్యలకు టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వసతుల కల్పనలో, జీతాలందించడంలో ప్రభుత్వం విఫలమైంది. – మార్తార్ బాల్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్