ఆటోడ్రైవర్ మహర్షిని స్తంభానికి కట్టేసి కొడుతున్న టీడీపీ మూక
పామూరు మండలం బొట్లగూడూరులో ఆటోడ్రైవర్‌పై అమానుష దాడి
టీడీపీ మూకల పైశాచికం
పామూరు (మార్కాపురం) : మానవత్వం మంటగలిసేలా ఓ ఆటోడ్రైవర్‌ను అమానుషంగా ఇనుప స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన శుక్రవారం మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని బొట్లగూడూరులో చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ మాకినేని శ్రీనివాసరావు, ఎస్సై కట్టా అనూక్ శనివారం వివరాలు వెల్లడించారు. పీసీ పల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్నె మహర్షి శుక్రవారం సాయంత్రం ఆటోలో నిమ్మకాయలు వేసుకుని పామూరు వస్తున్నాడు.
బొట్లగూడూరు సెంటర్‌కు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పక్కన నిలబడి ఉండగా తప్పించే క్రమంలో ఆటో తగిలింది. దీంతో బైక్ వద్ద ఉన్న మద్దినేని తిరుపతయ్యకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆటో నడుపుతున్న మహర్షితో గొడవపడి కిందకు దించేశారు. ఆటో అద్దాలు పగులగొట్టి మహర్షిని తాడుతో ఇనుప స్తంభానికి కట్టేసి కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహర్షిని విడిపించి పామూరుకు తీసుకొచ్చి చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు పంపారు.
అనంతరం క్షతగాత్రుడు మహర్షి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన కమ్మ ప్రసాదు, రేగలగడ్డ నాగేశ్వరరావు, దొడ్డోజి హరికృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసులు, కోటపాటి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన మిగిలిన వారిని కూడా గుర్తించి త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆరుగురినీ తహసీల్దార్ వద్ద బైండోవర్ చేస్తామని తెలిపారు. మరోవైపు బొట్లగూడూరులో పోలీస్ నిఘా ఏర్పాటుచేశారు. సీఐ, ఎస్సైతోపాటు 10 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, నలుగురు కానిస్టేబుళ్లతో పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


