ఓటు.. నోటు, ఒట్టు!

TDP Leaders Are Distributing Money To Voters - Sakshi

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తీరిది

అర్ధరాత్రి ఓటర్ల ఇళ్లకు వెళ్లి డబ్బుల పంపిణీ

ఓటేస్తామని ఒట్టేయించుకుంటున్న వైనం

అడిగినంత ఇస్తాం.. మా వెంట రండీ.. అంటూ టీడీపీ శ్రేణులు పచ్చ నోట్లు చూపిస్తూ జనాన్ని మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. మద్యం తాగించి మరీ కొంత మందిని ఊరేగింపునకు రప్పించుకున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని తుంబిగనూరు గ్రామ పంచాయతీలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సర్పంచి స్థానానికి టీడీపీ మద్దతుతో ఆ పార్టీ నేత కొట్రేగౌడ్‌ కుమార్తె అర్చన నామినేషన్‌ వేశారు. టీడీపీ నేతలు ఇలా బహిరంగంగా ప్రలోభాలకు గురిచేశారు.

సాక్షి, అమరావతి బ్యూరో: ‘అమ్మా.. మీ కుటుంబంలో ఎనిమిది మందికి ఓటు ఉంది. మీరంతా మేము బలపరుస్తున్న సర్పంచి అభ్యర్థికి ఓటు వేయండి. అందుకుగాను మీకు రూ.10 వేలు ఇస్తాం. డబ్బు తీసుకునే ముందు మా అభ్యర్థికే ఓటు వేస్తామని ఒట్టు వేయండి..’ ఇది కొద్దిరోజులుగా విజయవాడలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నందిగామ మండలానికి చెందిన ఓ కుటుంబాన్ని టీడీపీ నేతలు మంగళవారం అర్ధరాత్రి కలిసి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన తీరు. (చదవండి: 523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు ఇది. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలను సైతం భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు నోట్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తామని చెబుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఉపాధి కోసం ఊరి నుంచి వచ్చి ఒకేచోట ఎక్కువమంది ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని విందులు, వినోదాలకు తీసుకెళుతున్నారు. కొన్నిచోట్ల నేరుగా అభ్యర్థులే వెళుతుండగా.. మరికొన్ని ప్రాంతాలకు అనుచరులను పంపుతున్నారు.(చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..) 

రాకపోకల ఖర్చులకు ఆన్‌లైన్‌లో డబ్బులు..  
కృష్ణా జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, గన్నవరం, పెనమలూరు, పామర్రు, మైలవరం మండలాల్లోని 234 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆయా గ్రామాల్లో గతనెల 29న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారం ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో బరిలో ఉన్న టీడీపీకి చెందినవారి గెలుపునకోసం వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా నందిగామ, మైలవరం, పెనమలూరు, జగ్గయ్యపేట, విజయవాడ రూరల్‌ తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి నివసిస్తున్న ఓటర్లపై టీడీపీ నేతలు దృష్టి సారించారు. సొంతూరు వచ్చి ఓటేసి తిరిగి వెళ్లేందుకు అయ్యే ఖర్చులకు సొమ్ము అందజేస్తున్నారు. విజయవాడ నుంచి స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు బస్సులు, కార్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దూరప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లతో అభ్యర్థులు ఫోన్లలో నిత్యం మాట్లాడుతున్నారు. పోలింగ్‌ సమయానికి రావాలని, ఖర్చులన్నీ తాము చూసుకుంటామని హామీలిస్తున్నారు. కొందరికి ఖర్చులకోసం ముందే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top