Simhachalam Temple: అప్పన్నకే శఠగోపం

TDP govt removed 748 acres from the Simhachalam temple property list - Sakshi

748 ఎకరాలను సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన టీడీపీ ప్రభుత్వం 

విశాఖపట్నం చుట్టుపక్కల భూములు.. వీటి విలువ రూ.10 వేల కోట్లు పైనే..

2016లో ఒకే రోజు ఆలయ రికార్డుల నుంచి మాయం

ఎవరూ అడక్కుండానే కథ నడిపించిన అప్పటి ట్రస్టు బోర్డు

దీని కోసం ముగ్గురు అధికారులను మార్చిన బాబు సర్కారు

తాజాగా దేవుడి భూముల జియో ఫెన్సింగ్‌తో బయటపడిన భూ కుంభకోణం..

విచారణలో సూత్రధారుల గుట్టురట్టయ్యే అవకాశం 

సాక్షి, అమరావతి:  సెంటు స్థలం అటు ఇటు అయితే గొడవలు పడటం.. కోర్టులకు వెళ్తుండటం చూస్తున్నాం. అలాంటిది ఒక ఎకరా కాదు.. రెండెకరాలు కాదు.. ఏకంగా రూ.10 వేల కోట్లకు పైబడి విలువ చేసే 748 ఎకరాల భూములు మావి కాదంటూ దేవదాయ శాఖ పరులకు వదిలేసింది. ఇవి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు. స్వామి వారి భూములను జాగ్రత్తగా కాపాడాల్సింది పోయి.. ఎవరూ అడక్కపోయినా, ఇవి మావి కావంటూ ఇతరులకు ధారాదత్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఈ బాగోతం చోటుచేసుకుంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు తెర వెనుక వ్యవహారం నడపడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దేవాలయ భూముల, ఆస్తుల పరిరక్షణలో భాగంగా దేవుడి భూములకు జియో ఫెన్సింగ్‌ (ఆన్‌లైన్‌ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు) చర్యలకు ఉపక్రమించిన క్రమంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఒక్క రోజులో ఒక్క కలం పోటుతో..
సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పేరిట 11,282.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను అప్పటి విజయనగరం మహారాజులు రాసిచ్చారు. ప్రస్తుత విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉండే అడవి వరం, వెంకటాపురం, వేపగుంట, చీమాలపల్లి, పురుషోత్తపురం గ్రామాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. 1967–68లో ఈ భూముల వ్యవహారంలో ఎస్టేట్‌ ఎబాలిష్‌ యాక్ట్‌ వివాదం కొనసాగినప్పటికీ, 1977, 78లో అప్పటి ఇనామ్‌ తహాసీల్దార్‌ ఈ భూములన్నీ స్వామి వారికే చెందుతాయని డిక్లరేషన్‌ జారీ చేశారు. ఎస్టేట్‌ ఎబాలిష్‌ యాక్ట్‌ ప్రకారం అందులో కొంత భూమిని మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 9,069.22 ఎకరాలకు రెవిన్యూ అధికారులు దేవుడి పేరుతో రైతు వారీ పట్టా జారీ చేశారు. ఈ క్రమంలో 2016లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల చూపు ఈ భూములపై పడింది. ఎలాగైనా సరే కొంత భూమిని అయిన వాళ్లకు కట్టబెట్టాలని తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఇందుకు దేవదాయ శాఖను పావుగా వినియోగించుకున్నారు. ఏ ఒక్కరి నుంచి వినతి కానీ, ఫిర్యాదు కానీ లేకుండానే విశాఖపట్నం నగరానికి అనుకొని ఉండే 748.07 ఎకరాల దేవుడి భూములను ఒకే రోజు దేవదాయ శాఖ ఆస్తుల జాబితాల నుంచి తొలగించేశారు. ఈ భూములు స్వామి వారివి కావని, వేరే ఎవరివోనంటూ ప్రభుత్వం 2016 డిసెంబరు 14వ తేదీన అధికారికంగా ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి పలు భూములను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వు 

ఎవరూ అడగక్క పోయినా..
అడవివరం, వేపగంట్ల, చీమాలపల్లి రెవిన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 291 సర్వే నంబర్లకు సంబంధించి కొన్నింటిలో మొత్తం భూమిని, మరికొన్నింటిలో కొంత భాగం భూమిని స్వామి వారి ఆస్తుల జాబితాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. ఇందులో 306 ఎకరాల భూమికి సంబంధించి కుంభకోణం జరిగిందని ఇప్పటికే అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. లోతైన విచారణ జరిగితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రాష్ట్రంలో పలు చోట్ల సామాన్య ప్రజల వ్యవసాయ భూములు తప్పుగా నమోదు కావడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తరహా బాధిత రైతులు అధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదు. అలాంటిది సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల విషయంలో బాధితులమంటూ ఎవరూ స్వయంగా ప్రభుత్వానికి ఎలాంటి వినతులు పెట్టుకోలేదు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తనంతట తానుగా ఆ భూములను ఆలయ రికార్డుల నుంచి తొలగించేసింది. ఈ పరిణామంతో కుంభకోణం చోటుచేసుకుందని ప్రత్యేకించి చెప్పక్కరలేదని స్థానికులు అంటున్నారు.  

ఏకపక్ష నిర్ణయం.. నిబంధనలు బేఖాతరు 
ఒకే విడత ఇంత పెద్ద మొత్తంలో భూములను ఆలయ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ జరిగిన సమయంలో విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులో ఉన్న ముగ్గురు అధికారులు ఒక్క ఏడాదిలోనే వెంట వెంటనే బదిలీ అవ్వడం గమనార్హం. తద్వారా ఈ తతంగం మొత్తంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పుష్పవర్ధన్‌ను బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్వీఎస్‌ఎన్‌ మూర్తిని నియమించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనను కూడా బదిలీ చేసి సుజాత అనే మరో అధికారిని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా నియమించారు. ఓ ఆలయ ఆస్తుల జాబితా నుంచి నిర్ణీత కారణాలతో ఏవైనా భూములను తొలగించాలంటే దేవదాయ శాఖ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.  ఆలయ ఆస్తుల జాబితాలో పేర్కొన్న భూములపై ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిపత్రం పెట్టుకుంటే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మొదట ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ)కు పంపాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనలపై ఏసీ సంతృప్తి చెందిన పక్షంలో ఆ వివరాలతో పబ్లిక్‌ నోటీసు జారీ చేస్తారు. సంబంధిత ఆలయ ప్రాగంణం, సంబంధిత భూముల గ్రామ కార్యాలయం, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం సహా మొత్తం ఐదు బహిరంగ ప్రదేశాల్లో ఆ పబ్లిక్‌ నోటీసును ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశమివ్వాలి. ఆ తర్వాత అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకుని ఆ భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి. ఆస్తుల జాబితా రిజస్టర్‌లో తొలగించిన భూముల వివరాల వద్ద సంబంధిత జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. 

2010 ఆస్తుల రిజిస్టర్‌ను సాకుగా చూపి..
ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల తొలగింపునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చూపిన కారణం ఏమిటంటే.. ఆ భూములను తప్పుగా నమోదు చేశారని చెప్పారు. సర్వే నంబర్ల వారీగా ‘ఇనాం బి. రిజిస్టర్‌ నందు పట్టా నెం.2లో ఇతర ఇనాం భూమిగా నమోదు చేయబడి దేవస్థానం టైటిల్‌డీడ్‌ నంబరు 3145 నందు నమోదు కాలేదు’ అని పేర్కొన్నారు. మరికొన్ని భూములను గతంలో వేరే వారికి కేటాయించారని, విక్రయించారని చూపుతూ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తొలగించారు. 2004కు ముందు వివిధ ప్రభుత్వ, ప్రజా అవసరాలకు విశాఖపట్నం జిల్లాలో సింహాచలం శ్రీవరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ భూములను చాలా సందర్భాలలో అప్పటి ప్రభుత్వాలు కేటాయింపులు చేశాయి. మధ్య తరగతి ప్రజల ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డుకు కొంత భూమిని నిర్ణీత ధరకు బదలాయించారు. ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్‌ వంటి సంస్థలు రావడానికి పూర్వమే భూములను కేటాయించారు. 2000–03 మధ్యలో ఆలయ భూములను అక్రమించుకున్న వారికి నిర్ణీత ధర ప్రకారం అక్రమణల క్రమబద్దీకరణ చేసి ఎల్‌ఆర్‌సీ సర్టిఫికెట్లను జారీ చేశారు. అవన్నీ 2004కు ముందు జరిగిన పరిణామాలు. ఆలయ భూములపై హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూముల అమ్మకం, కేటాయింపులపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. కాగా, 2010లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజస్టర్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉండే ఆస్తులను నమోదు చేసి, మిగిలినవి తొలగిస్తూ మార్పులు చేర్పులు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 2016లో టీడీపీ ప్రభుత్వం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగిస్తున్నట్టు రికార్డులో పేర్కొంది.

ఆలయ ఆస్తుల కోసం ప్రత్యేక రిజిస్టర్‌ 
ప్రతి ఆలయానికి ఆ ఆలయం పేరిట ఉన్న భూములు, స్వామి వారి నగలు, నగదు రూపంలో బ్యాంకులో ఉండే డిపాజిట్‌ వంటి వివరాలతో ప్రత్యేక రిజిస్టర్‌ ఉంటుంది. 1966 దేవదాయ శాఖ చట్టం ప్రకారం దీనిని 25వ నంబరు రిజస్టర్‌గా పిలిచేవారు. 1966–88 మధ్య ఈ రిజస్టర్‌ను 38వ నంబరుగా మార్చారు. 1987 తర్వాత 43వ నంబరు రిజస్టర్‌గా పిలుస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి స్వామి వారి ఆస్తుల వివరాల్లో చోటు చేసుకునే మార్పు చేర్పులను ఆ రిజస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. 

సమగ్రంగా విచారణ
సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 2016లో ఒకేసారి 748 ఎకరాలు తొలగించిన విషయం మా పరిశీలనకు కూడా వచ్చింది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు ఈ అంశంపై శాఖ కార్యదర్శి వాణీమోహన్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌ కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాం. సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించేందుకు తగిన చర్యలు చేపట్టాం. 
– అర్జునరావు, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top