
రాష్ట్రంలోని 251 ఎయిడెడ్ స్కూళ్లకు కూటమి ప్రభుత్వం నోటీసులు
40 కంటే తక్కువ ఎన్‌రోల్ ఉన్న వాటిపై చర్యలకు సిద్ధం
వచ్చే విద్యా సంవత్సరానికల్లా విలీనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్ల విలీనం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 763 ఎయిడ్ స్కూళ్లు ఉండగా.. 40 కంటే తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న 251 స్కూళ్ల కరస్పాండెంట్లకు నోటీసులు జారీ చేయాలని డీఈవోలను పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఇటీవల ఇదే తరహాలో విజయనగరం జిల్లాలోని ఏడు స్కూళ్లను విద్యా శాఖలో విలీనం చేసింది. ఇప్పుడు మరో 251 స్కూళ్లకు నోటీసులు ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ స్కూళ్ల యాజమాన్యాలకు రెండుసార్లు నోటీసులు ఇచి్చనట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.
తుది నోటీసులు ఇచ్చి.. ఈ స్కూళ్లను సిబ్బందితో సహా విద్యా శాఖలో విలీనం చేయనున్నట్లు వెల్లడించాయి. నోటీసులో పేర్కొన్నా జాబితాలో అనకాపల్లి జిల్లాలో 2, అనంతపురంలో 8, అన్నమయ్యలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, బాపట్లలో 26, చిత్తూరులో 4, తూర్పు గోదావరిలో 10, ఏలూరులో 8, గుంటూరులో 29, వైఎస్సార్ కడపలో 18, కాకినాడలో 5, అంబేడ్కర్ కోనసీమలో 2, కృష్ణాలో 13, కర్నూలులో 2, మన్యంలో 5, నంద్యాలలో 8, నెల్లూరులో 6, ఎన్టీఆర్ జిల్లాలో 12, పల్నాడులో 17, ప్రకాశంలో 35, తిరుపతిలో 6, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారులను డైరెక్టరేట్ ఆదేశించింది. ఈ స్కూళ్ల విలీనం పూర్తయితే దాదాపు 900 నుంచి 1,000 మంది ఉపాధ్యాయులు.. అంతే సంఖ్యలో బోధనేతర సిబ్బంది కూడా విద్యా శాఖలో విలీనమయ్యే అవకాశం ఉంది.
వారిని అదే మండలంలో నియమించాలి
స్కూళ్ల విలీనం అనంతరం మిగులుగా తేలిన ఎయిడెడ్ ఉపాధ్యాయులను అదే మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. కాగా, రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న 3 వేల మంది ఉపాధ్యాయులకు సెపె్టంబర్ నెల వేతనం ఇంకా జమ చేయలేదని.. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్‌కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.