
సర్కారు పెద్దలకు కావాల్సిన ‘రియల్’ వ్యాపారులకు ఏపీఐఐసీ ఆహా్వనం
పారిశ్రామిక పార్కుల నిర్మాణం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన ఏపీఐఐసీ
పేదల కడుపుకొట్టి సేకరించిన భూములు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం.. రాష్ట్ర వ్యాప్తంగా 5,221.09 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
100 ఎకరాలకు పైగా 15 చోట్ల 4,737.86 ఎకరాల్లో ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు
100 ఎకరాలకు లోపు 16 చోట్ల 483.23 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు.. మొత్తంగా 31 పార్కుల కోసం బిడ్లను ఆహ్వానించిన వైనం
తమకు కావాల్సిన వారికి విలువైన భూములను కూటమి ప్రభుత్వం ఎలాంటి జంకు లేకుండా ధారాదత్తం చేస్తోంది. రూ.వేల కోట్ల విలువైన భూములను పప్పుబెల్లాలకు ఇచ్చేస్తోంది. ఎకరం కోట్ల రూపాయలు చేసే భూములను కారు చౌకగా ఇవ్వడం తగదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చెవికెక్కించుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు ఏపీఐఐసీ సేకరించిన భూములను సైతం తన బినామీ రియల్ ఎస్టేట్ సంస్థలు, రహస్య భాగస్వాములకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఇంతగా బరితెగించి భూముల పందేరం సాగించడం ఇదివరకెన్నడూ చూడలేదని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి.
సాక్షి, అమరావతి : పారిశ్రామిక అవసరాల కోసం పేదల నుంచి కారు చౌకగా సేకరించిన భూములను పారిశ్రామిక పార్కుల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాల్సిన ఏపీఐఐసీ.. ఆ పని వదిలేసి, రియల్ ఎస్టేట్ సంస్థల అడుగులకు మడుగులు వత్తుతోంది. ఇప్పటికే ఐటీ పార్కుల ముసుగులో విశాఖలో వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేసిన విషయం తెలిసిందే.
తాజాగాఏపీ ప్రైవేటు ఇండ్రస్టియల్ పార్క్స్ విత్ ప్లంగ్ అండ్ ప్లే ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాలసీ 2024–29 పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలకు భూములు అప్పగిస్తోంది. తొలి విడతలో 31 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పేరిట 5,221.09 ఎకరాలను, కావాల్సిన వారికి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. 100 ఎకరాలు పైబడిన వాటిని లార్జ్ పార్కులుగా, 100 ఎకరాల లోపు వాటిని ఎంఎస్‌ఎంఈ పార్కులుగా వర్గీకరించి.. ఆ మేరకు పార్కులను డిజైన్ చేసి, నిర్మించి నిర్వహించడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది.
మొత్తం 13 లార్జ్ పార్కుల కింద 4,737.86 ఎకరాలు, 16 ఎంఎస్‌ఎంఈ పార్కుల కింద 483.23 ఎకరాలను కట్టబెట్టనుంది. అంతేకాకుండా ప్రైవేటు ఇండ్రస్టియల్ పార్కుల పాలసీ కింద ఎకరానికి రూ.3 లక్షల క్యాపిటల్ సబ్సిడీతో పాటు అనేక రాయితీలు ఇవ్వనుంది. పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేసిన వారే కాకుండా వాణిజ్య భవనాలు, గృహ సముదాయాలు, గిడ్డంగులు వంటి నిర్మాణాలు చేపట్టిన రియల్ ఎస్టేట్ సంస్థలూ పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో పాలుపంచుకోవచ్చని నిర్ణయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు
ప్రైవేటు పార్కుల పాలసీ ముసుగులో తమకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే ఈ నిబంధనల ఉద్దేశమని వారు స్పష్టం చేస్తున్నారు. పారిశ్రామిక పార్కుల్లో కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సముదాయాలు, ఆస్పత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ల నిర్మాణానికి అనుమతిస్తున్నారంటే దీని వెనుక ఉన్న ‘రియల్’ ఉద్దేశాలు అర్థం చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కొత్తచోట్ల కాకుండా ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించి అభివృద్ధి చేయడం ద్వారా రూ.వేల కోట్లు పలుకుతున్న జయంతిపురం, రాంబల్లి, కోసల నగరం, రౌతుసురమాల, తిమ్మసముద్రం, సంతబొమ్మాళి వంటి చోట్ల ప్రైవేటు వ్యక్తులకు భూమి కేటాయింపులు చేయడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతమెంతో ఘన చరిత్ర
ఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ)కు దేశ వ్యాప్తంగా మంచి పేరుంది. ఎటువంటి కన్సల్టెన్సీల ప్రమేయం లేకుండానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఫార్మా, బయో టెక్నాలజీ పార్కులను ఈ సంస్థ నిరి్మంచింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ భూమి సేకరిస్తోందంటే.. తమ బిడ్డలతోపాటు ఇరుగు పొరుగు వారికి ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో ఎంతో మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ తీరు పూర్తిగా మారిపోయింది.
547 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్న సంస్థ.. కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయలేమంటూ చేతులెత్తేసింది. పేదల నుంచి సేకరించిన రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి ఉత్సాహం చూపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జపిస్తున్న పీ–4.. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్‌నర్ షిప్ విధానంలో కాకుండా పీ–3.. పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్ షిప్ విధానంలో పారిశ్రామిక పార్కులను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయనుంది. పీ–4 విధానంలో అయితే భూములు ఇచి్చన రైతులూ భాగస్వామ్యం అవుతారు. దీంతో దాన్ని పక్కకు పెట్టి పీ–3 విధానంలో 5,221.09 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది.
కాగా, దళితులు, గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమిని కేటాయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటు పార్కుల ఏర్పాటుతో ఆ రిజర్వేషన్‌కు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. దీంతో దళిత పారిశ్రామిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.